బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం.. ప్రతిఘటించిన జగన్
సాక్షి, హైదరాబాద్: హైడ్రామా నడుమ జగన్‌ను శుక్రవారం అర్ధరాత్రి 11.45 సమయంలో ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తీసుకొచ్చాక ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం జరిగింది. మొదటిసారి జరిగిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో అర్ధరాత్రి 12.30 సమయంలో రక్త నమూనాలను సేకరించే నెపంతో మరోసారి ఫ్లూయిడ్స్ గొట్టాలను ఆయన ఒంట్లోకి గుచ్చేందుకు ప్రయత్నించారు. దాన్ని కూడా జగన్ అడ్డుకున్నారు.
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మరోసారి జగన్‌కు నచ్చజెప్పేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ‘‘ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కాబట్టి ఫ్లూయిడ్స్ ఇచ్చేందుకు అంగీకరించండి’’ అని కోరారు. మరోవైపు ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతూ, శరీరంలో ప్రమాదకరమైన కీటోన్స్ సంఖ్య పెరగడంతో నెఫ్రాలజిస్టులను పిలిపించి పరీక్షలు చేయించారు.