జూన్ కల్లా దేశీ జీప్ కంపాస్
ఎఫ్సీఏ ఇండియా ప్రెసిడెంట్ కెవిన్ ఫ్లిన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నాటికల్లా దేశీయంగా తయారు చేసిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్యూవీ) జీప్ కంపాస్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆటోమొబైల్ సంస్థ ఎఫ్సీఏ ఇండియా ప్రెసిడెంట్ కెవిన్ ఫ్లిన్ వెల్లడించారు. పుణెకి దగ్గర్లోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో తమ తొలి మేడిన్ ఇండియా జీప్ కంపాస్ వాహనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ.16–20 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా.
సుమారు రూ.20–30 లక్షల శ్రేణిలో ఉన్న హ్యుందాయ్ టక్సన్, టయోటా ఫార్చూనర్ వంటి వాటికి పోటీనివ్వొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే జీప్ పోర్ట్‌ఫోలియోలో రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వాహనాలు ఉన్నాయి. వీటి ధర రూ.56 లక్షల నుంచి రూ.1.1 కోట్ల దాకా ఉంది. ఇవి ప్రస్తుతం కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ కింద దిగుమతవుతున్నాయి. జీప్ కాంపాస్‌లో పెట్రోల్, డీజిల్ వేరియేషన్స్ ఉంటాయని, మ్యాన్యువల్.. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభ్యమవుతాయని ఫ్లిన్ వివరించారు. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్సీఏ ఇండియా.. జీప్ కంపాస్ ప్రాజెక్టుపై 280 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది.