గోద్రా ప్రధాన నిందితుని అరెస్టు
ముంబై: గోద్రా రైలుకు నిప్పంటించి 56 మంది సజీవదహనానికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు,మాజీ కార్పొరేటర్ ఫరూక్ బానాను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బానా 2002 నుంచి పరారీలో ఉన్నాడు. గోద్రా నుంచి ముంబై వెళుతున్న బానాను పాంచ్ మహల్ జిల్లాలోని కరోల్ టోల్ ప్లాజా వద్ద ఆరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
2002లో ముంబై పారిపోయిన బానా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారమెత్తాడు. గోద్రా ఘటన సమయంలో రైల్వే స్టేషనకు సమీపంలోని తన గెస్ట్ హౌసులో రైలుకు నిప్పంటిచిన నిందితులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 2002 లో ఒక గుంపు సబర్మతి ఎక్సప్రెస్ కు నిప్పంటించిన ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇందులో నిందితులుగా ఉన్న 33 మందిలో 2011లో 11 మందికి మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది.