క్రమబద్ధీకరణపై 9న కీలక భేటీ
* జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
* ఈ అంశంపై సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం
* డీఎస్సీల్లో నష్టపోయిన వారిపైనా చర్చ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ నెల 9న కీలక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్ల క్రమబద్ధీకరణకూ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నాటికి విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
త్వరలో క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,796 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే అందులో అందరిని ఒకేసారి క్రమబద్ధీకరిస్తారా? లేదా దశలవారీగా సీనియారిటీ ఆధారంగా క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతారా? అన్న అంశాలను కూడా సీఎస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తేల్చి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లోనూ పనిచేస్తున్న 966 మంది లెక్చరర్ల క్ర మబద్ధీకరణపై చర్చించనున్నారు. ఇక 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లోనూ నష్టపోయిన వారికి న్యాయం చేసేలా విద్యాశాఖ కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో జరిగే కీలక సమావేశంలో వారి అంశంపైనా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.