KGBV teachers
-
అమ్మకు శిక్షణ.. బిడ్డకు రక్షణ
సాక్షి, అమరావతి: పాలుతాగే పసికందులను వదిలి వెళ్లేందుకు ఏ మాతృమూర్తికీ మనసొప్పదు. పక్కింటికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంది. తప్పనిసరిగా వదిలి వెళ్లాల్సివస్తే మాత్రం బాగా కావాల్సిన వారికి మాత్రమే అప్పగిస్తుంది. కానీ.. ఉద్యోగం సాధించి, శిక్షణ కోసం వారం రోజులపాటు వదిలి ఉండాల్సి వస్తే..! సరిగ్గా ఇలాంటి తల్లుల ఇబ్బందిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారు శిక్షణ పొందుతున్న ప్రాంగణాల్లోనే ప్రత్యేక బేబీకేర్ సెంటర్ల (ఎఫ్ఎల్ఎన్ కిడ్స్‌స్పేస్)ను ఏర్పాటుచేసింది. పిల్లలు తినే ఆహారం.. ఏ సమయానికి ఏం తింటారు.. ఎప్పుడు నిద్రపోతారు.. ఇలా అన్ని వివరాలను తీసుకుని ప్రత్యేకంగా పాలు, ఆహారం, ఆట వస్తువులతో పాటు కేర్ టేకర్లను సైతం నియమించింది. ఉదయం ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యేటప్పుడు పిల్లలను ఈ కిడ్స్స్పేస్లో వదిలి తల్లులు ట్రైనింగ్‌కు హాజరై.. సాయంత్రం తిరిగి తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ బిడ్డకు ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను, సంరక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష అధికారులు తీసుకున్నారు. కొత్తగా కేజీబీవీల్లో చేరిన టీచర్లకు మరింత మెరుగ్గా బోధనా నైపుణ్యాలు అందించేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు విజయవాడ, విశాఖపట్నంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చేటప్పుడు తమ పిల్లల బాధ్యత ఎలాగని బెంగపడ్డ టీచర్లు.. పిల్లల కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేయడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 1,190 మంది కేజీబీవీ టీచర్లకు శిక్షణ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో బోధన కోసం 1,190 మందిని టీచర్లుగా నియమించింది. వారంతా దాదాపు 24 నుంచి 30 ఏళ్లలోపు వారే. వారికోసం విజయవాడ, విశాఖపట్నంలో ఫౌండేషన్ లెరి్నంగ్ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)పై ఈనెల 6 నుంచి శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది చంటి పిల్లలతో రావడం, ఆ పిల్లలను ఎక్కడ ఉంచాలో తెలీక ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు వెంటనే అదే ప్రాంగణంలో ‘ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ కిడ్స్ స్పేస్’ సెంటర్లు ఏర్పాటుచేశారు. టాయ్స్ కార్నర్, హోలిస్టిక్ డెవలెప్మెంట్ సెంటర్, స్లీపింగ్ కార్నర్, స్టోరీ టెల్లింగ్ కార్నర్, మదర్/గార్డియన్‌ను అందుబాటులో ఉంచారు. టీచర్ల ఏకాగ్రత శిక్షణపై ఉండేలా పిల్లల సంరక్షణ బాధ్యత అధికారులే తీసుకోవడం ఇదే ప్రథమం. గతంలో శిక్షణకు తాము మూడు నెలల బిడ్డలతో వచ్చి ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పిల్లల సంరక్షణను సమగ్ర శిక్ష అధికారులు తీసుకోవడం గొప్ప విషయమని సీనియర్ టీచర్లు సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడ, విశాఖపట్నంలో మొదటి విడత శిక్షణ ముగియడంతో ఈనెల 16 నుంచి అనంతపురం, తిరుపతిలో టీచర్ల శిక్షణ మొదలవుతుందని, అక్కడ కూడా ఇదే తరహా బేబీకేర్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. తల్లులు ఇబ్బంది పడకూడదనే.. బాలికా విద్యాభివృద్ధే ధ్యేయంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేజీబీవీల ద్వారా నాణ్యమైన చదువుతోపాటు చక్కని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అక్కడ తల్లిదండ్రులకు, సంరక్షకులకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుతుంటారు. వారికి రక్షణతో పాటు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే కొత్తగా చేరిన టీచర్లకు బోధనా నైపుణ్యాలతో పాటు విద్యార్థులు, సహచరులతో మెలగాల్సిన విధానాలపై శిక్షణ ఇస్తున్నాం. అయితే, ఈ శిక్షణ కేంద్రానికి కొందరు చిన్నపిల్లలతో వచ్చి ఇబ్బందిపడడం గమనించాను. వారి ఏకాగ్రత కోల్పోకుండా వారి పిల్లల సంరక్షణ బాధ్యతను మేం తీసుకుని బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటుచేశాం. పిల్లలను చూసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలను సంరక్షకులుగా నియమించాం. – బి. శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఎస్పీడీ పిల్లల కోసం చక్కటి ఏర్పాట్లు.. ట్రైనింగ్ అనగానే సబ్జెక్టు వరకే ఉంటుందనుకున్నాను. టీచర్‌కు ఉండాల్సిన ఉత్తమ లక్షణాలను, విద్యార్థులు, తోటి టీచర్లతో ఎలా ఉండాలి?, కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ ప్రయోగాలు, విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు ఎలా రాబట్టాలి వంటి అంశాలపై చక్కని శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కొందరు తమ పసిపిల్లలను తీసుకొస్తే అంగన్వాడీ ఆయాలు, ప్రథమ్ సభ్యులకు పిల్లల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. పిల్లల కోసం బెస్ట్‌ఫుడ్, ఆట వస్తువులు, నర్సులను అందుబాటులో ఉంచారు. – విజయ జాగు, కెమిస్ట్రీ పీజీటీ, నక్కపల్లి కేజీబీవీ (అనకాపల్లి జిల్లా) ఇంటి వాతావరణం తలపించేలా.. కేజీబీవీ టీచర్ శిక్షణ కోసం నాలుగు నెలల పాపతో వచ్చాను. కొత్త ప్రదేశం.. పైగా చల్లని వాతావరణం, పాప తట్టుకోలేదేమోనని ముందు భయపడ్డాను. ఒకవైపు శిక్షణ.. మరోవైపు పాపను చూసుకోవడం ఇబ్బంది తప్పదనుకున్నాను. కానీ, ఇక్కడ పిల్లల కోసం వేడినీళ్లు, పాలు, సెరిలాక్, ఆహారం వంటివి ఏర్పాటుచేశారు. ఆరోగ్య జాగ్రత్తల కోసం నర్సులను నియమించారు. కొంచెం పెద్ద పిల్లలకు ఆట వస్తువులు, బొమ్మలు ఏర్పాటుచేశారు. భోజనం, వసతి ఇంటిని తలపించేలా ఉంది. – హెచ్ఆర్. దివ్యశ్రీ, తాడిమర్రి కేజీబీవీ, బోటనీ పీజీటీ (అనంతపురం జిల్లా) -
ఇంటర్వ్యూలు కట్.. మెరిట్‌కే మార్కులు
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావిచ్చే ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అభ్యర్థుల అర్హతలు, అనుభవం ప్రాతిపదికగా మెరిట్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సమగ్ర శిక్ష అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అభ్యంతరాలకు 4 రోజుల పాటు అవకాశం కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియగా గురువారం పరిశీలన నిర్వహించారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం లాంటి అంశాల ప్రాతిపదికగా ప్రొవిజినల్ మెరిట్ జాబితాను శుక్రవారం ఆయా జిల్లాల్లో ప్రకటించనున్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను అందులో పొందుపర్చనున్నారు. వీటిపై ఎవరికైనా సందేహాలున్నా, అభ్యంతరాలున్నా అప్పీళ్లకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. 11వ తేదీ నుంచి 14వ తేదీవరకు నాలుగు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మొత్తం 100 మార్కులు అర్హతలు, అనుభవం తదితర అంశాలకు 100 మార్కులను కేటాయించారు. అభ్యర్థులకు వచ్చే గరిష్ట మార్కులను బట్టి మెరిట్‌ను నిర్ణయించనున్నారు. గరిష్ట మార్కులు సాధించిన వారు అగ్రభాగాన నిలువనున్నారు. కేజీబీవీల్లో రెండేళ్లు ఆపై పనిచేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రకటించినా వారికి మార్కులు కేటాయించలేదు. అర్హతలు, అనుభవం తదితర అంశాల్లో ఇతర అభ్యర్థులతో సమాన స్థాయిలో నిలిచిన వారికి కేజీబీవీల్లో పనిచేసిన అనుభవం ఉంటే మెరిట్ లిస్టులో ప్రాధాన్యం ఇస్తారు. సమాన మార్కులు వస్తే? అర్హతలు, అనుభవం అంశాలలో సమానంగా ఉన్న వారి విషయంలో ఎక్కువ వయసు వారికి ప్రాధాన్యమిస్తారు. అందులోనూ సమానంగా ఉంటే వరుస క్రమంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, తదుపరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతల పరంగా వరుసగా పీజీ, గ్రాడ్యుయేషన్, ఇంటర్, టెన్త్ మార్కులను అనుసరించి మెరిట్ నిర్ణయిస్తారు. విద్యార్హతల్లో సమానంగా ఉంటే ప్రొఫెషనల్ అర్హతల్లో మెరిట్‌ను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు గత సర్కారు కేజీబీవీల్లో ఎంపిక ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో దరఖాస్తులు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించి జాబితాను జిల్లా అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాయి. ఈ వ్యవహారంలో ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడ్డాయి. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాయి. ఒక్కో పోస్టును రూ.లక్షల్లో విక్రయించాయి. డబ్బులిచ్చిన వారికి ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్కులు కేటాయించి మెరిట్ జాబితాలో చోటు కల్పించారు. ఈ అక్రమాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీల విధానాన్ని రద్దు చేశారు. అవుట్సోర్సింగ్ నియామకాలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా కేజీబీవీల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్ల నియామకాలు పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టీచర్ల నియామకాలను చేపట్టినట్లు కేజీబీవీ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. -
జీతాల్లో కోత..అసౌకర్యాల వాత!
సాక్షి, అమరావతి: ఒకే రకమైన ఉద్యోగం.. విధులన్నీ ఇద్దరికీ సమానమే.. కానీ, వారికిచ్చే వేతనాల్లోనే భారీ తేడా. ఇది ఏపీ, తెలంగాణాల్లో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ అధ్యాపక సిబ్బంది పరిస్థితి. తెలంగాణ అధ్యాపకులకు అక్కడి ప్రభుత్వం రూ.23వేలు వేతనం ఇస్తుండగా ఏపీ సర్కారు మాత్రం ఇక్కడ రూ.12వేలు మాత్రమే ఇస్తోంది. అంతేకాక, వీరిని తగినంత సంఖ్యలో నియమించకపోవడం, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకులపై రెట్టింపు భారం పడుతోంది. బోధనా కార్యక్ర మాలతో పాటు వసతిగృహాల్లో ఉండే బాలికల రక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంది. మరోపక్క ముందస్తు ఏర్పాట్లు, నిధుల కేటాయింపు లేకుండా వీటిని ప్రారంభించడంతో విద్యార్థినులకు వసతి సమస్యలతో పాటు భోజనం, ఇతర సదుపాయాలూ అరకొరగా ఉంటున్నాయి. అలాగే, రాత్రి వేళల్లో బాలికలకు రక్షణగా ఉండే అధ్యాపక సిబ్బందికి ఇక్కడ సరైన వసతిలేక నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్ల భవనాల్లోనే కాలేజీ విద్యార్థులు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బాలికల కోసం 33 జూనియర్ కాలేజీలను కూడా ఏర్పాటుచేశారు. వీటిని కేజీబీవీ స్కూళ్లలోనే ప్రారంభించారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నవిద్యార్థినులకే ఇక్కడి భవనాలు సరిపోక నానా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడే కాలేజీలను సైతం ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల తాత్కాలిక రేకుల షెడ్లను ఏర్పాటుచేశారు. వీరందరికీ 2, 3 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. ఫుల్‌టైమ్ వర్క్‌కు పార్టు టైమ్ వేతనమూ లేదు ఈ 33 కేజీబీవీ కాలేజీల్లో మొత్తం 231 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానమైన అర్హతలుండి ఇంటర్వ్యూ, డెమోలను నిర్వహించిన అనంతరం మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి వీరిని ఎంపికచేశారు. వాస్తవానికి వీరిని కాంట్రాక్టు పద్ధతి మీద నియమించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌టైమ్ అని పేరుపెట్టి నియామకాలు జరిపింది. అలాగే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వేతనాల్లో భారీగా కోత పెడుతోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెగ్యులర్ సిబ్బంది మూల వేతనంతో సమానంగా వేతనం కల్పించారు. ఇటీవల పీఆర్సీ ప్రకారం కూడా రాష్ట్రంలోని కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఈ తరుణంలో పార్ట్‌టైమ్ అధ్యాపకులకు ఆ మేర కూడా వేతనాలివ్వడం లేదు. పనిచేస్తున్నది ఫుల్‌టైమ్ అయినా పార్ట్‌టైమ్ పేరిట వేతనాల్లో భారీగా కోతపెట్టారు. పక్కనే ఉన్న తెలంగాణ కేజీబీవీ కాలేజీల్లో పనిచేస్తున్న ఇదే అధ్యాపకులకు అక్కడి ప్రభుత్వం రూ.23వేలు వేతనంగా చెల్లిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని మరింత పెంచుతామని చెబుతోంది. ఇక్కడ మాత్రం కేవలం 12వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడి వంట పనివారికి, అటెండర్లకు ఇచ్చే వేతనం కన్నా వీరికి వచ్చే జీతం తక్కువ. వీరికి నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. పార్ట్‌టైమ్ అని తీసుకుని వీరికి నైట్‌డ్యూటీ, హాలిడే డ్యూటీ, హౌస్‌టీచర్ డ్యూటీ ఇలా అన్ని రకాల డ్యూటీలు కేటాయిస్తున్నారు. కాలేజీ బోధన కోసం నియమితులైన వీరికి అక్కడి స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకుండా ఆ పని కూడా చేయిస్తున్నారు. పగలు తరగతుల్లో బోధన.. రాత్రి బాలికలకు రక్షణగా ఉండి మళ్లీ బోధనకు సిద్ధం కావలసి వస్తోంది. కాగా, ఈ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఈ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభించారు. డిసెంబర్‌కల్లా సిలబస్ పూర్తిచేయాలని ఆదేశాలివ్వడంతో అదనపు తరగతులు నిర్వహించి బోధిస్తున్నారు. కేజీబీవీల్లో స్పెషలాఫీసర్ తరువాత కేడర్ వీరిదే అయినా కనీసం జాబ్‌చార్టు కూడా ఇవ్వలేదు. మరోపక్క బాలికలను జేఈఈ, ఎంసెట్, జిప్మెర్ వంటి పరీక్షలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అదనపు సిబ్బందిని నియమించకుండా ఈ సిబ్బందిపైనే రెట్టింపు భారం మోపుతోంది. -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
జగదేవ్‌పూర్: కేజీబీవీ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని కొరుతూ బుధవారం మండలంలోని కేజీబీవీ ఉపాధ్యాయులు మధ్యాహ్న సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో ఉన్నవిధంగా ఆకస్మికంగా సెలవులు 20 నుండి 27 వరకు పెంచాలని కోరారు. వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత వైద్యం, హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. వేసవి సెలవులకు కూడా వేతనం చెల్లించాలని, స్పెషల్ ఆఫీసర్లను, ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ శారద, ఉపాధ్యాయులు స్వప్న, సంధ్య తదితరులు పాల్గొన్నారు.