అధికారులను అడ్డుకున్న పాము
తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహాలను తరలిస్తున్న అధికారులకు అనుకోని అవాంతరం ఎదురైంది. పురాతన విగ్రహాలను తీసుకెళ్తున్న రెవెన్యూ సిబ్బందిని పాము వెంబడించడంతో.. అధికారులు ఆ విగ్రహాలను అక్కడే వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలు.. గ్రామానికి చెందిన భూస్వామి రాజా తన పొలాన్ని బుల్డోజర్ల సాయంతో చదును చేయిస్తున్న క్రమంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను పరిశీలించారు. పురాతన శివలింగం, వీరభద్రుడి విగ్రహంతో పాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం తవ్వకాల్లో బయటపడింది.
దీంతో తహశీల్దార్ కనకదుర్గ వాటిని స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించేందుకు తీసుకెళ్తుండగా.. ఓ పాము ఆమెను వెంబడించింది. రెవెన్యూ సిబ్బంది అందరు ఆమె వెంట ఉన్నా.. పాము మాత్రం కేవలం విగ్రహాలు పట్టుకున్న ఎమ్మార్వోనే వెంబడించింది. దీంతో భయాందోళనలకు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం కార్యాలయానికి వెళ్లిన సిబ్బందికి కూడా విచిత్ర అనుభవాలు ఎదురవుతుండటంతో పాటు ఆందోళన పెరిగిపోవడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాలను గురువారం తిరిగి యధాస్థానానికి చేర్చారు. ఈ విషయం సమీప గ్రామాలకు పాకడంతో విగ్రహాలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.