విమానంలో అరబిక్‌లో మాట్లాడినందుకు..
వాషింగ్టన్: ఎలాంటి కారణం లేకుండానే అమెరికాలో విమానం నుంచి మరో ప్రయాణికుడిని దించివేశారు. అరబిక్ భాషలో మాట్లాడినందుకే ఇలా చేశారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీ విద్యార్థి ఖైరుల్దీన్ మఖ్జూమీ (26) వాపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మఖ్జూమీ ఇరాక్ నుంచి శరణార్థుడిగా అమెరికాకు వచ్చాడు. ఈ నెల 9న లాస్ ఏంజిలెస్ నుంచి కాలిఫోర్నియా వెళ్లేందుకు సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. విమానం బయల్దేరేముందు మఖ్జూమీ బంధువుకు ఫోన్ చేసి అరబిక్‌లో మాట్లాడాడు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పాల్గొనే సెమీనార్ గురించి చర్చించాడు. ఈ ఈవెంట్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై అడగాల్సిన ప్రశ్న గురించి మాట్లాడాడు. విమానంలో మఖ్జూమీ మందు వరుస సీటులో కూర్చున్న ఓ మహిళ అతనితో వాదనకు దిగింది.
ఈ విషయాన్ని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అరబిక్ భాషలో ఎందుకు మాట్లాడావని మఖ్జూమీని ప్రశ్నించారు. అతణ్ని విమానం నుంచి దించివేశారు. ఎఫ్‌బీఐ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. మఖ్జూమీపై ఎలాంటి అనుమానాలు లేవని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మఖ్జూమీ 8 గంటల అనంతరం మరో విమానంలో వెళ్లాడు. ఈ ఘటనపై మఖ్జూమీ స్పందిస్తూ.. తనకు, తన కుటుంబానికి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని, ఇది కేవలం మరో ఘటన అని అన్నాడు.