బసవతారకం ఆస్పత్రి పైనుండి పడి మహిళ మృతి
టాయ్ లెట్ కోసం వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందిన ఘటన గురువారం బంజారా హిల్స్ పరిధిలోని బసవతారకం ఆస్పత్రిలో జరిగింది. ప్రమాదం వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కు చెందిన ఖైరున్నీసా బేగం(60) బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో చేరిన కూతురు జకీరా సుల్తానాకు సాయంగా ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఆపరేషన్ కోసం కోసం జకీరా సుల్తానాను ఆస్పత్రి బ్లాక్-3లో ఉన్న ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. కూతురితోపాటు ఖైరున్నీసా కూడా ప్రీ ఆపరేటెడ్ వార్డు వరకు వెళ్లింది.
కొద్దిసేపటికి ఆమె మూత్రవిసర్జన కోసం సమీపంలో ఉన్న టాయ్‌లెట్ అని రాసి ఉన్న గదిలోకి వెళ్లింది. తర్వాత అక్కడే ఉన్న మరో గది తలుపులు తెరిచి బయటకు రావడానికి అడుగు ముందుకేసింది. అయితే ఆ గది బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేసినది కాదని డ్రెయినేజీ పైప్లైన్లు, కరెంటు వైర్లు బాగుచేయడానికి ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారమని ఆమెకు తెలియకపోవడంతో అక్కడి నుంచి కిందపడి మృతి చెందింది. ఖైరున్నీసా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మీడియాను ఘటనాస్థలానికి అనుమతించలేదు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.