ఖాకి చిత్రానికి సీక్వెల్ రెడీ.. !
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఇటీవల హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించడంపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలు అధికం అవుతున్నాయి. అలా ఇటీవల కమలహాసన్ నటించిన విక్రమ్, పొన్నియిన్‌సెల్వన్ చిత్రానికి సీక్వెల్‌తో పాటు జిగర్ తండ మూవీకి కూడా సీక్వెల్‌గా 'జిగర్ తండ డబుల ఎక్స్' చిత్రం మంచి విజయాన్ని సాధించాయి.
కాగా నటుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ, సర్ధార్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించనున్నట్లు ఆ చిత్రాలు దర్శక, నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. తాజాగా నటుడు కార్తీ మరో సీక్వెల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈయన ఇంతకు ముందు హెచ్. వినోద్ దర్శకత్వంలో 'ఖాకి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. నటి రకుల్ ప్రీత్‌సింగ్ నాయకిగా నటించిన ఈ చిత్రం 2018లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కాగా ఐదేళ్ల తరువాత కార్తీ హెచ్. వినోద్ కాంబోలో ఖాకి చితత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.
కార్తీ నటించిన జపాన్ చిత్రం ఇటీవలే తెరపై వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన వాద్దియారే (టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఖైదీ–2, సర్ధార్ –2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇదేవిధంగా హెచ్ వినోద్ ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తీ హీరోగా 'ఖాకి' సీక్వెల్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.