23 ఏళ్ల దుబాయ్ సంపాదనతో కల సాకారం
దుబాయ్ : స్వదేశాన్ని వదిలి ఎవరైనా పరాయి దేశానికి ఎందుకు వలస వెళ్తారు? ఏదో నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న తపనతో వలస పోతుంటారు. కానీ పాకిస్తాన్‌లోని సియల్ ప్రావిన్స్‌కు చెందిన మక్బూల్ అక్తర్(45) అనే వ్యక్తి మాత్రం గొప్ప లక్ష్యం సాధించేందుకు దుబాయ్‌కు వెళ్లారు. స్వస్థలంలో పాఠశాల ఏర్పాటు చేయాలన్నదే అతని కల. దాన్ని నిజం చేసుకునేందుకు 23 ఏళ్లు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్కూల్ ఏర్పాటు కోసం పొదుపు చేస్తూ వచ్చారు. చదువుపై తనకున్న మక్కువతో తాను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నట్టు ‘ఖలీజ్ టైమ్స్’తో మక్బూల్ తెలిపారు.
పాకిస్తాన్లో ఆటో డిప్లామా ఇన్ మొబైల్ ఇంజనీరింగ్ చేసిన మక్బూల్ 1995లో దుబాయ్ వెళ్లారు. కొన్ని ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నారు. మళ్లి తిరిగి 2002లో దుబాయ్ వెళ్లారు. ఆయన భార్య ఇస్లామిక్ స్టడీస్‌లో బాచిలర్స్ డిగ్రీ చేశారు. పెళ్లి తర్వాత భార్యను ప్రోత్సాహించి ఆమెతో మాస్టర్ డిగ్రీ చేయించారు. మక్బూల్‌కు ఐదుగురు సంతానం అందులో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.. అందరు చదువులో ముందున్నారు.
మొదట తన ఇంట్లోనే చిన్నపాటి పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దుబాయ్ వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక భవనం నిర్మించి అందులో స్కూల్‌ను నిర్వహించనున్నారు. తన భార్యను ఆ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌గా నియమించి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచాలన్నదే అతడి ఆశయం. ఇంత కష్టపడి ఏర్పాటు చేస్తున్న ఈ స్కూల్లో మరో గొప్ప విషయం ఏమిటంటే పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడం. త్వరలోనే తన కల సాకారం అవుతుండటం పట్ల మక్బూల్, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.