ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదు
ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్: పాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పి.భాస్కర్,రమలు విమర్శించారు. శనివారం జిల్లాకు వచ్చిన వారు స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ కార్మికులు,ఆయాలు వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి వేతనాలు పెంచకుండా మరింత పనిభారం పెంచుతూ వెట్టిచాకిరి చేయించుకుంటోందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలను పూర్తిగా ప్రైవేట్,కార్పొరేట్లకు అమ్మివేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారని వారి సర్వీసు కాలం పూర్తయినా, ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదన్నారు. వారి వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ,వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
11 నుంచి నిరవధిక నిరహార దీక్ష
అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాం డ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈనెల 17న మధ్యాహ్న భోజన ఏజన్సీ కార్మికుల ‘చలో హైదరాబాద్’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో లక్షా 50వేల మంది మధ్యాహ్నం భోజన ఏజన్సీ కార్మికులు ఉన్నారని, ప్రభుత్వం వారి పొట్ట గొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
19న బీడీ కార్మికుల చలో హైదరాబాద్
బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న చలో హైదరాబాద్ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 10,11వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈనెల 20న కాం ట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఉద్యమిస్తామన్నారు.
10,11న బీడి కార్మికుల దీక్షలు
జీఓ నెంబర్ 41ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈనెల 10,11వ తేదీలలో జిల్లా కేంద్రాలలో చేపట్టనున్న బీడీ కార్మికుల దీక్షలను జయప్రదం చేయాలని ఏపీ, బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ పిలుపునిచ్చారు. బీడీ కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని కోరారు. నెలకు మూడు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలకు 26 రోజుల పని కల్పించాలన్నారు.