బేడీలు వేయటం పొరపాటే: మంత్రి
నిజామాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో ఆందోళనకు కారకులైన రైతులకు బేడీలు వేయడం పొరపాటేనని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు అత్యుత్సాహం చూపించారని ఆయన అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఖమ్మం మార్కెట్ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సంచలనం సృష్టించింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై గురువారం కోర్టు వద్ద రైతుల బంధువులు, న్యాయవాదులు, విపక్షాల నాయకులు, మానవ హక్కుల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతా ధికారులు వెంటనే స్పందించి ఇద్దరు ఏఆర్ ఎస్సైలను సస్పెండ్ చేయడంతోపాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.