24వేల ర్యాంక్ కార్డును 13వేలుగా మార్ఫింగ్..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3లో ఆ యువతికి 24 వేల ర్యాంకు వచ్చింది. కానీ తనకు 13వ ర్యాంకు వచ్చిందంటూ వాదించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. మెడికల్ కౌన్సిలింగ్ లో భాగంగా శనివారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభమైంది. తెలంగాణలోని ఐదు కేంద్రాల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థినీ విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలోని దూర విద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కౌంటర్ లో ఓ యువతి గందరగోళం సృష్టించింది.
ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక యువతి ఎంసెట్ 3లో తనకు 13వ ర్యాంకు వచ్చిందని ర్యాంక్ కార్డును అధికారులకు చూపించింది. అయితే ఆ ర్యాంక్ కార్డును మార్ఫింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు అనుమానంతో పేరు, ఇతర వివరాలను పరిశీలించగా ఆమె అసలు ర్యాంక్ 24 వేలు అని వెల్లడైంది. కానీ ఆ యువతి మాత్రం తన వాదనను అలాగే కొనసాగించడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. 'ఒక యువతి ఏడుస్తూ వచ్చి తనకు 13వ ర్యాంకే వచ్చిందని అలజడి చేయబోయింద'ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ వ్యవహారంపై జేఎన్టీయూ అధికారులకు ఫిర్యాదు చేశామని, తప్పుడు ర్యాంక్ కార్డును చూపిన విద్యార్థినిపై కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు.