సామాజిక కార్యకర్త ఆత్మహత్య
బంగ్లాపైనుంచి దూకి తనువు చాలించిన ఖుర్షీద్ అన్వర్
అత్యాచార ఆరోపణలతోనే ఈ తీవ్ర నిర్ణయం?
న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెమోక్రసీ స్వచ్ఛంద సంస్థకు డెరైక్టర్‌గా కొనసాగుతున్న ఖుర్షీద్ అన్వర్ ఆత్మహత్య చేసుకున్నారు. వసంత్‌కుంజ్‌లోని తన ఇంటిపైనుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖుర్షీద్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఓ యువతి ఆరోపించడంతో కలత చెందిన ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పలు టీవీ ఛానళ్లలో కూడా యువతిపై అత్యాచారం జరిపాడంటూ పదే పదే కథనాలు ప్రసారం చేశాయి. ఆయన ఆత్మహత్యకు ప్రత్యక్షసాక్షి పెయింటర్ భగవతి ప్రసాద్. ఆయన మాట్లాడుతూ... ‘నేనో సైన్ బోర్డుకు పెయింట్ వేస్తున్నాను. అంతలోనే పెద్దగా శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే ఓ మనిషి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే సాయం కోసం అరిచాను. చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకొని అతణ్ని ఫొర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లాం. అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశార’న్నాడు.
ఓ ఎన్జీవోలో పనిచేస్తున్న యువతి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తాను చేసిన ఆరోపణల గురించి మాట్లాడుతూ... ‘అన్వర్ డెరైక్టర్‌గా కొనసాగుతున్న ఎన్జీవోలోనే పనిచేస్తున్న నా స్నేహితురాలితో కలిసి సెప్టెంబర్ 12న అన్వర్ ఇంట్లో పార్టీకి వెళ్లాను. అక్కడ నా స్నేహితురాలు ఆల్కహాల్ తాగి వాంతులు చేసుకుంది. దీంతో అన్వర్, సహచర ఉద్యోగులు ఆ రోజు అక్కడే ఉండమని సలహా ఇచ్చారు. దీంతో అక్కడే పడుకున్నామ’ని చెప్పింది. ‘తర్వాత రోజు ఉదయం అన్వర్ ఓ క్యాబ్‌ను సమకూర్చడంతో ఇంటికి వెళ్లిపోయిన ఆ యువతి మరుసటి రోజే తనపై అత్యాచారం జరిపాడంటూ అన్వర్‌పై ఆరోపణలు చేసింది. స్నేహితులకు విషయం చెప్పడంతో వారంతా కేసు పెట్టమని సలహా ఇచ్చారు. కానీ ఆమె కేసు పెట్టకుండా మణిపూర్‌లోని ఇంటికి వెళ్లిపోయింది. ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత సహచరులతో కలిసి జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును కమిషన్ పోలీసులకు పంపార’ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇదిలాఉండగా అన్వర్ డైరీలో ఈ విషయమై కొంత సమాచారం దొరికిందని, ఇతర ఎన్జీవోలకు చెందిన యువతులు తనను లక్ష్యంగా చేసుకొని, తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అందులో ఉందని పోలీసులు తెలిపారు.