కారుడ్రైవర్ కిడ్నాప్ కలకలం
డబ్బు కోసం నిర్బంధించిన కాంట్రాక్టర్
పోలీసుల చొరవతో బాధితుడికి విముక్తి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో కారుడ్రైవర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. కారు మరమ్మతులకు సంబంధించి ఇవ్వాల్సిన డబ్బు కోసం ఓ కాంట్రాక్టర్ తన వద్ద డ్రైవర్‌గా పని చేసే వ్యక్తిని మూడు రోజులుగా నిర్బంధించాడు. పోలీసుల రంగప్రవేశంతో బాధితుడికి విముక్తి కలిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మేడిమాకులపల్లికి చెందిన రఘురామ్చౌదరి అనే కాంట్రాక్టర్ అనంతపురంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్నాడు. ఈయనకు నల్లచెరువు వద్ద స్టోన్ క్రషర్ ఉంది. ఆయన వద్ద కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లికి చెందిన ఎరికల గంగాధర్ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం కారును తీసుకెళ్లిన డ్రైవర్ వాహనం మరమ్మతులకు వచ్చిందని చెప్పాడు. మరమ్మతులు చేయించి తీసుకురా అని కాంట్రాక్టర్ ఆదేశించాడు.
అయితే గంగాధర్ మరమ్మతు చేయించకపోగా.. కారును కూడా అప్పగించకుండా తప్పించుకు తిరుగుతుండేవాడు. అయితే మరమ్మతులకు అయ్యే ఖర్చు రూ.15 వేలు ఇవ్వాలని తెలపగా.. ఇస్తానని డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు కాంట్రాక్టర్ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. మూడు రోజుల క్రితం గంగాధర్‌ను ఇంటికి పిలిపించుకుని ఓ గదిలో నిర్బంధించాడు. చేతులు కట్టేసి విపరీతంగా కొట్టాడు. గంగాధర్‌కు శనివారం సెల్‌ఫోన్ చిక్కడంతో వెంటనే బంధువులకు సమాచారం అందించాడు. వారు వెంటనే అనంతపురం నాలుగో పట్టణ ఎస్ఐ శ్రీరామ్‌కు తెలిపారు. సీఐ శ్యాంరావ్, ఎస్ఐలు శ్రీరామ్, సాగర్ తమ సిబ్బందితో శ్రీనగర్‌కాలనీకి వెళ్లి నిర్బంధంలో ఉన్న డ్రైవర్‌కు విముక్తి కల్పించారు. అనంతరం కాంట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.