తండ్రులారా.. ఆ అలవాటు మానేయండీ!
లండన్: కాలుష్యపూరిత వాతావరణంలో పెరిగే పిల్లలు ఆస్తమాబారిన పడతారనే విషయం తెలుసు. కానీ పిల్లల్లో ఆస్తమాకు కారణం తండ్రులేనని తాజాగా చేసిన ఓ పరిశోధనలో తేలింది. యుక్తవయసు నుంచే పొగతాగే అలవాటున్నా, పొగతాగడం మితిమీరినా.. వారికి జన్మించే పిల్లలు లేదా ఆ కుటుంబంలోని పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనలో రుజువైంది. అన్నిదేశాల్లోనూ ఇలా జరిగే అవకాశాలు అధికమని తేల్చేశారు.
నార్వేలోని బెర్జెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 24,000 మంది పిల్లలపై పరిశోధన చేయగా.. వారిలో ఆస్తమా బారిన పడిన పిల్లల తండ్రులకు పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. సాధారణ కారణాలతో ఆస్తమాబారిన పడిన పిల్లలతో పోలిస్తే స్మోకింగ్ చేసే తండ్రులున్న కుటుంబంలోని పిల్లలు మూడింతలు ఎక్కువగా ఆస్తమాబారిన పడుతున్నారని బెర్జెన్ యూనివర్సిటీ పరిశోధకుడు సిసిలీ స్వాన్ తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తండ్రులు పొగతాగడం మానేసినా దాని ప్రభావం మాత్రం పిల్లలపై ఆ తర్వాత కూడా కొనసాగినట్లు గుర్తించారు.