నేటి ఉదయం నుంచి రహదారుల బంద్
శ్రీకాకుళం, శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న నినాదంతో నిరంతర పోరాటం సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కార్యాచరణకు ఉద్యుక్తమైంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించిన నెల రోజుల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లా 48 గం టలపాటు రహదారుల దిగ్బంధానికి సిద్ధమైంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రహదారులను బంద్ చేసేందుకు పార్టీ శ్రేణులు కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. సమైక్యవాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునివ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీవో, విద్యార్థి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వర్గాల నుంచి ఈ కార్యక్రమాలనికి స్పం దన కనిపిస్తోంది.
దిగ్బంధన కార్యక్రమంపై మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశమై చర్చించి, కార్యాచరణను సిద్ధం చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి సాగుతున్న ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో ఆయా ప్రాంతాల నాయకులు బాధ్యత తీసుకుని రాకపోకలను స్తంభింపజేస్తారు. పాలకొండ, రాజాం, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల నాయకులు తమ పరిధిలోని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తారు. ఇందులో భాగంగా పలు చోట్ల రహదారులపై వంటావార్పు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.
సమైక్యవాదులందరూ పాల్గొనాలి : కృష్ణదాస్
రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీల పరంగా సమైక్యాంధ్ర కోసం ఒక్క వైఎస్ఆర్ సీపీయే పోరాటం చేస్తోందన్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్దేశంచిన నెల రోజుల పోరాట కార్యక్రమంలో భాగంగా బుధ, గురువారాల్లో ప్రధాన రహదారులను దిగ్భంధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. వారిని భాగస్వాములను చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీ సమన్వయకర్తలతో ఈ కార్యక్రమంపై చర్చించారు.
సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, పీఎంజే బాబు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణలతోపాటు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు మార్పు ధర్మారావు, పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జి.టి.నాయుడు, పార్టీ జిల్లా ఆడహక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు ప్రధాన రాజేంద్ర, కరిమి రాజేశ్వరరావు, తంగి శివప్రసాద్, మహమ్మద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.