ఫేస్బుక్లో లైకులు.. ప్రముఖ మోడల్ అరెస్టు!
లండన్: ప్రముఖ మోడల్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు వెలుగుచూడటం బ్రిటన్‌లో కలకలం రేపుతోంది. గతంలో 'ద సన్' పత్రికకు అర్ధనగ్నంగా పోజిచ్చిన మోడల్ కింబర్లీ మినెర్స్ను లండన్ పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. మినెర్స్ రహస్యంగా ఇస్లాం మతంలోకి మారి.. సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ వీడియోలను లైక్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నదని బ్రిటన్ యాంటీ టెర్రరిస్టు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల ఉగ్రవాద నిరోధక చట్టం-2000 కింద ఆమెను గత శుక్రవారం అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయిందని 'ద సండే టైమ్స్' పత్రిక తెలిపింది.
'ద సండే టైమ్స్' కథనం ప్రకారం.. 27 ఏళ్ల మినెర్స్ ఫేస్బుక్లో ఆయిషా లారెన్ ఆల్ బ్రిటానియా పేరిట ఖాతా తెరిచి.. ఐఎస్ఐఎస్కు అనుకూలంగా పోస్టులు పెడుతున్నది. ఐఎస్ఐఎస్ వీడియోలు, తుపాకులు పట్టుకున్న ముస్లిం మహిళల ఫొటోలు షేర్ చేయడమే కాకుండా.. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న బ్రిటన్ సంతతి ఫైటర్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నదని పోలీసులు గుర్తించారు. దీని గురించి గతంలో పలుసార్లు హెచ్చరించిన అధికారులు తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారని, ఆమె ఇంట్లో కూడా సోదాలు జరిపారని ఆ పత్రిక తెలిపింది. అయితే, తన పేరిట నకిలీ ఖాతా తెరిచి ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.