King George Medical University
-
కోవిడ్ వారియర్స్ ఆహారంలో పురుగులు
లక్నో: కరోనాపై పోరులో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయక.. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటూ పేషంట్లకు వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం నిజంగా క్షమార్హం. మంచి భోజనం అందించడం కనీస బాధ్యత. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) వైద్య సిబ్బందికి అందించిన ఆహారంలో పురుగులు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఇలా జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా అనేకసార్లు ఆహారంలో పురుగులు కనిపించాయి. దాంతో ప్రస్తుతం కేజీఎంయూ మెడికల్ సిబ్బంది దీని గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. (ఆస్పత్రి పడక.. తప్పుల తడక!) వివరాలు.. రెయిన్ బసేరా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కేజీఎంయూ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీస్ విభాగంలో పనిచేసే క్లీనింగ్ సిబ్బందికి అందజేసిన ఆహారం ప్యాకెట్లో పురుగులు వచ్చాయి. గతంలో కూడా రెసిడెంట్ వైద్యులు, నాన్ క్లినికల్ సిబ్బందికి అందించిన ఆహారంలోనూ పురుగులు కనిపించాయి. దీని గురించి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన లేదు. దాంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాక డ్యూటీ అవర్స్ అయిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి రెసిడెంట్ డాక్టర్లుకు కేటాయించిన గదుల్లో ఫ్యాన్లు కూడా సరిగా పని చేయడం లేదని తెలిపారు. కోవిడ్-19 డ్యూటీలో ఉన్న వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. నాణ్యతలేని ఆహారం తీసుకుంటే వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం పాలవుతారని సూచిస్తున్నారు. (మాస్కు ధరించనందుకు మహిళపై..) బస్తి జిల్లా వైద్యులు కూడా ఆహారం నాణ్యత పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అందిస్తోన్న నాణ్యత లేని ఆహారం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ పేషంట్లతో పాటు వారికి సేవలందించే వైద్యులకు మంచి భోజనం అందించడం కనీస బాధ్యత అని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండి పేషంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
హెచ్ఐవీ పేషెంట్.. కరోనాను జయించాడు
లక్నో: హెచ్ఐవీ పేషెంట్ ఒకరు కేవలం ఆరు రోజుల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గొండాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న బంధువులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడటంతో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. పరీక్షల అనంతరం అతడికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. అంతేకాక బాధితుడు తనకు హెచ్ఐవీ ఉందని... ప్రస్తుతం అందుకు సంబంధించిన మందులు వాడుతున్నాని వైద్యులతో చెప్పాడు. ఈ మేరకు చికిత్స అందించడంతో కేవలం 6 రోజుల్లోనే సదరు వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.(కరోనా పాజిటీవ్.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ) ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ... ‘ఇలాంటి కేసు రావడం ఇదే ప్రథమం. ప్రొటోకాల్ ప్రకారమే అతడికి వైద్యం చేశాం. కేవలం ఆరు రోజుల్లో అతడికి కరోనా నయమైంది. చికిత్స అనంతరం రెండు సార్లు కరోనా నెగిటీవ్‌గా రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం రెండు వారాల పాటు అతడిని హోం క్వారంటైన్లో ఉండమని చెప్పాం. గతంలో ఓ క్యాన్సర్ పేషెంట్‌కు కూడా కరోనా పూర్తిగా నయమయ్యింది. డయబెటీస్ ఉన్న వారు కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు’ అని వైద్యులు తెలిపారు. -
నగర యువతికి యూపీ గవర్నర్ అవార్డు అందజేత
హైదరాబాద్: నగరానికి చెందిన యువతికి నాలెడ్జ్ అవార్డు దక్కింది. అల్వాల్ భూదేవినగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్మీ అధికారి సయ్యద్ ఇబ్రహీం కుమార్తె సయ్యద్ బేబానస్రీకి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నాలెడ్జ్ అవార్డ్ దక్కించుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కెఎల్ఆర్ ఆనోరా దంత వైద్య కళాశాలలో బీడీఎస్ ఫైనలియర్ చదువుతున్న బేబానస్రీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జరిగిన సైన్టిఫిక్ కన్వెన్షన్‌లో కట్టుడు పళ్ల విభాగంలో ప్రతిభ కనబర్చింది. దీంతో కింగ్ జార్జ్ యూనివర్సిటీ ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ చేతుల మీదుగా అవార్డు అందించింది. -
బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్‌ను డీ కొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలోని ట్రూమా సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.