టమాటా కాలాంతకుడు !
‘సీఈటీ’ లీక్‌కూ పథకం
పీయూసీ కింగ్‌పిన్ శివకుమారయ్య అరెస్ట్‌తో వెల్లడవుతున్న నిజాలు
విస్తుపోతున్న పోలీసులు
పలు యూనివర్శిటీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో కుమారయ్య హస్తం
బెంగళూరు : కర్ణాటకలో ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కటకటాలపాలైన ప్రధాన ముద్దాయి, కింగ్‌పిన్ శివకుమారయ్య పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. కేవలం పీయూసీ ప్రశ్నపత్రాలే కాకుండా సీఈటీతో పాటు మరికొన్ని యూనివర్శిటీలకు చెందిన ప్రశ్నపత్రాలను లీక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సీఐడీ అధికారుల విచారణలో వెలుగుచూసింది.
ఈ ఏడాది ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం రెండు సార్లు లీక్ అయిన ఘటనలో ప్రధాన నిందితుడైన శివకుమారయ్య రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల విక్రయ సమయంలో ఎవరికి అనుమానం రాకుండా ‘టమాటా’ అనే కోడ్ భాష వాడే శివకుమారయ్యను, సన్నిహితులు సైతం టమాటా అని పిలుస్తుంటారు. తుమకూరు జిల్లా గుబ్బికి చెందిన శివకుమారయ్య గతంలో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విచారణలో శివకుమారయ్య ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... కొన్నేళ్లుగా ఈ శివకుమారయ్య పీయూసీ, సీఈటీతో పాటు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల ముందు శివకుమారయ్య సహకారంతో సీఈటీలో ర్యాంకును పొంది ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న యువతి ఇప్పటి వరకూ ఇతనికి సహాయం చేసినట్లు తెలుస్తోంది. రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం లీకు ఘటనలో శివకుమారయ్య పేరు బయటకు వచ్చిన వెంటనే సదరు యువతికి అతడు కొంత డబ్బు ఇచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకోడానికి సహాయపడినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు.
సీఐడీ అధికారులు చివరికి ఆ యువతి ద్వారానే శివకుమారయ్య అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా అతడు అజ్ఞాతంలో ఉంటూనే ఈ ఏడాది సీఈటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్చేయడానికి స్కెచ్ వేశాడని, అయితే పోలీసుల నిఘా ఎక్కువ ఉండటంతో తన ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. ఇక శివకుమారయ్యకు ప్రశ్నపత్రాల లీకుకు సంబంధించి సహకారం అందించేవారిలో ప్రధానంగా పీయూసీ బోర్డులో గ్రూప్ 2 స్థాయి ఉద్యోగితో పాటు ఇద్దరు గ్రూప్–డీ ఉద్యోగులు కూడా ఉన్నారని సీఐడీ విచారణలో తేలింది. సదరు గ్రూప్ డీ ఉద్యోగులు ఇన్నోవా కారులో కార్యాలయానికి వచ్చేవారని ఇదంతా తనకు సహకారం అందించినందుకు పొందిన ప్రతిఫలమని శివకుమారయ్య సీఐడీ విచారణలో తెలిపినట్లు సమాచారం.