గాడిన పడతారా..?
►నేడు పంజాబ్‌తో తలపడనున్న సన్‌రైజర్స్
►వరుస ఓటములతో హైదరాబాద్ బేజారు
హైదరాబాద్: ఐపీఎల్లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ అరంభంలో దూకుడు ప్రదర్శించి.. ప్రస్తుతం పరాజయాల బాట పట్టిన హైదరాబాద్–పంజాబ్ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈమ్యాచ్‌లో నెగ్గి తిరిగి గాడిలో పడాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి.
సొంతగడ్డపై అనుకూలత..
ఈ సీజన్లో సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ విజయం సాధించింది. అనంతరం కోల్‌కతా, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పంజాబ్‌తో మ్యాచ్ సొంతగడ్డపై జరుగుతుండడం సన్‌రైజర్స్‌కు సానూకూలాంశంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈమ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గాడిలో పడాలని ఆజట్టు యోచిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూలస్తంబంగా నిలుస్తున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్నిస్తున్నాడు. అయితే మిడిలార్డర్లో మోజెస్ హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా తదీతరులు విఫలమవుతున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్, నమన్ ఓజా కూడా తమ బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంది. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టోర్నీలో పది వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ నీలి రంగు టోపీని హస్తగతం చేసుకున్నాడు. మరోవైపు ఆఫ్గాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో టాప్–త్రీలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆశిష్ నెహ్రా రాణిస్తున్నాడు. ప్రస్తుతం రెండు విజయాలు, రెండు పరజయాలతో కొనసాగుతున్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఎలాగైన నెగ్గాలని భావిస్తోంది.
వరుస ఓటములతో పంజాబ్ డీలా..
మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ది కూడా సన్‌రైజర్స్ లాంటి పరిస్థితే. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ముఖ్యంగా టాపార్డర్ విఫల కావడం జట్టును కలవరపరుస్తోంది. జట్టులో మేటి ఆటగాళ్లైన కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, ఇయాన్ మోర్గాన్, హషీమ్ ఆమ్లా సత్తా చాటాలని జట్టు ఆశిస్తోంది.
మరోవైపు ఢిల్లీతో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో పరుగులను భారీగా సమర్పించుకోవడం జట్టును దెబ్బతీసింది. దీన్ని ఎలాగైనా సరిదిద్దుకోవాలని జట్టు యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తుంది. బౌలర్లలో ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మలపై ఆశలు పెట్టుకుంది. గతంలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించడం, ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడం లాంటి అంశాలతో ఇషాంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశముంది. పాయింట్ల పట్టికలో చెరో నాలుగు పాయింట్లతో ఉన్న ఈ జట్లు ఈ మ్యాచ్‌లో నెగ్గి విజయమంత్రాన్ని అందుకోవాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి.