తనిష్క్ చోరీ కేసులో కిరణ్ అనే వ్యక్తి లొంగుబాటు
హైదరాబాద్ : తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీ కేసులో కిరణ్ అనే ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఈ చోరీకి పాల్పడినట్లు ఆవ్యక్తి చెబుతున్నాడు. కిరణ్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇందులో భాగంగా చోరీ జరిగిన రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సంస్థకు చెందిన మరో వ్యక్తి, జ్యువెలర్స్‌కు చెందిన మరొకరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మాజీ తాజా ఉద్యోగులకు సంబంధించి సమాచారం సేకరించటంతో పాటు మరికొన్ని అనుమానలను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. షోరూమ్‌కు చెందిన కొన్ని రికార్డుల్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా తనిష్క్ జ్యువెలర్స్‌లో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే నిన్న ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.