జిల్లాపై కేసీఆర్ నజర్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్‌తోపాటు పది అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లను కేసీఆర్ రంగంలోకి దింపినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్న వివిధ పార్టీలకు చెం దిన సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు చెందిన ప్రధాన పార్టీల సీనియర్లు పలువురు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తుండటం.. తాజాగా 11న ఆయన జిల్లాకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్న పలువురిపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ నేతలకు టీఆర్ఎస్ గాలం
ఆదిలాబాద్‌పై ఆధిపత్యం పెంచుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాపై ఇప్పటికే టీఆర్ఎస్ పట్టు సాధించింది. మొదటి నుంచి టీడీపీని ఆదరించిన జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ పార్టీకి పూర్తిగా దూరమవుతూ వచ్చారు. ఇప్పటికే ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, రామన్నలు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ రాథోడ్ రమేష్ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు గోడం నగేశ్, సుమన్ రాథోడ్‌లపై కూడా ఈ రకమైన ప్రచారం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కులు ఆ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ మంత్రం జపిస్తుండగా, ప్రధాన పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ప్రజాప్రతినిధులు, సీనియర్లపై టీఆర్ఎస్ దృష్టి సారించడం రాజకీయవర్గాల్లో తాజా అంశంగా మారింది. ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండగా, 2014 ఎన్నికల్లో బోథ్, నిర్మల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోను విజయావకాశాలున్న అభ్యర్థులకు గాలం వేసే పనిలో టీఆర్ఎస్ పడింది.
ఈ నెలాఖరులోగా చేరికలకు మాట..
2014 ఎన్నికలు లక్ష్యంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఇటీవలే శిక్షణ తరగతులు నిర్వహించిన ఆ పార్టీ జిల్లాలో మరో ఐదు నియోజకవర్గాల్లోను పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్, బోథ్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రజల్లో మంచి పట్టున్న ఓ సీనియర్ నేతతో ఇటీవలే మాట్లాడినట్లు తెలిసింది. నిర్మల్‌లో ఇప్పటికే పార్టీ ఇన్చార్జి ఉన్నా... ఆయనకు నచ్చచెప్పి పార్టీలో చేర్చుకునే విషయమై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు కూడా మంతనాలు జరిపినట్లు చెప్తున్నారు.
ఓ వైపు కేసీఆర్, మరోవైపు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సీనియర్లతో మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా వుండగా 2013 డిసెంబర్ మొదటి వారం నాటికి కాంగ్రెస్-టీఆర్ఎస్లు, బీజేపీ-టీడీపీ మధ్య పొత్తులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా ఏ పార్టీలకు పొత్తుల విషయమై స్పష్టత లేకపోవడంతో విడివిడిగానే పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో టీఆర్ఎస్ పొత్తుల ప్రసక్తి లేకుండా... అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. జిల్లాకు చెందిన పలువురికి ‘గులాబి’ కండువా వేసేందుకు ఈ నెలాఖరుకల్లా గడువు పెట్టినట్లు సమాచారం.