Kistapur
-
ఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..!
బోథ్: భర్త చనిపోవడంతో ఓ మహిళను... అత్తింటివాళ్లు అమ్మేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన లలిత అనే మహిళను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్లో అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రమేశ్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు శివానీ పుట్టిన ఏడాదికే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లలిత తన కూతురుతో కిష్టాపూర్‌లోని అత్తవారింట్లోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రోజువారి వేతనం కింద అటెండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆమె బావ చౌహాన్ అర్జున్ తరచూ లలితను వేధించేవాడు. నెల రోజులుగా లలిత క్షేమ సమాచారాలు తెలియకపోవడంతో ఆమె సోదరుడు జగదీశ్ కిష్టాపూర్‌కు వెళ్లి విచారించాడు. తన సోదరిని ఇచ్చోడ గ్రామానికి చెందిన రేఖ, శారదలతో కలిసి చౌహాన్ అర్జున్ గుజరాత్లో అమ్మేసినట్లు తెలిసిందని జగదీశ్ పేర్కొన్నాడు. ఇదే విషయం అర్జున్ను అడగగా తనకేమీ తెలియదని చెప్పగా మేనకోడలును తీసుకుని సొనాలకు వెళ్లానని తెలిపాడు. కాగా మంగళవారం రాత్రి మద్యం సేవించి సొనాలలోని తమ ఇంటికి వచ్చిన అర్జున్ పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి యత్నించాడని జగదీశ్ వాపోయాడు. అదే రోజు సాయంత్రం తన సోదరి లలిత ఫోన్ చేసి తనను గుజరాత్లో రూ.లక్షా 80వేలకు అమ్మేశారని తెలిపినట్లు జగదీశ్ పేర్కొన్నాడు. దీంతో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపాడు. కాగా ఓ మహిళను విక్రయించడం జిల్లాలో సంచలనానికి దారితీసింది. -
కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
రెబ్బెన, న్యూస్‌లైన్ : మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి సోమవారం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులకు గ్రామంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఆగ్రహించిన గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. గతంలో కిష్టాపూర్‌లో పర్యటించిన సందర్భంగా గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేశాకే తిరిగి గ్రామంలో అడుగుపెడతానని ఎమ్మెల్యే ఆత్రం సక్కు హామీ ఇచ్చారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి గ్రామం వైపే కన్నెత్తి చూడలేదని విమర్శించారు. గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాకే తిరిగి గ్రామంలో ఓట్లు అడిగేందుకు రావాలంటూ ప్రచారానికి అడ్డుతగిలారు. రోడ్డు వేసే వరకు ఓటెయ్యం ఏటా వర్షాకాలంలో నారాయణపూర్ నుంచి కిష్టాపూర్ వరకు బురదమయంగా మారే రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పూర్తిగా బురదమయం అవుతుంద ని తెలిపారు. అయినా ప్రజా ప్రతినిధులు పట్టిం చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే నాయకులకు కిష్టాపూర్ గ్రామ ప్రజలు గుర్తుకు వస్తున్నారని దుయ్యబట్టారు. కిష్టాపూర్‌కు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్‌రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాశ్‌రావు గ్రామస్తులను శాంతింపచేసే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవటంతో చేసేదేమీ లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు. -
పెళ్లికి 2 గంటల ముందు పెళ్లికొడుకు పరార్
మెదక్: పెళ్లికి రెండు గంటల ముందు పెళ్లికొడుకు కుటుంబం, పెళ్లికొడుకు పరారయ్యారు. జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్‌లో ఈ ఘటన జరిగింది. జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌కు చెందిన విజయ రెడ్డికి పెళ్లి కుదిరింది. ఈ రోజు పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి ఇంకా రెండు గంటలు సమయం ఉందనగా పెళ్లికొడుకుతోపాటు అతని కుటుంబ సభ్యులు అందరూ చెప్పాపెట్టకుండా పారిపోయారు.