కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
రెబ్బెన, న్యూస్‌లైన్ : మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి సోమవారం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులకు గ్రామంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఆగ్రహించిన గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు.
గతంలో కిష్టాపూర్‌లో పర్యటించిన సందర్భంగా గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేశాకే తిరిగి గ్రామంలో అడుగుపెడతానని ఎమ్మెల్యే ఆత్రం సక్కు హామీ ఇచ్చారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి గ్రామం వైపే కన్నెత్తి చూడలేదని విమర్శించారు. గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాకే తిరిగి గ్రామంలో ఓట్లు అడిగేందుకు రావాలంటూ ప్రచారానికి అడ్డుతగిలారు.
రోడ్డు వేసే వరకు ఓటెయ్యం
ఏటా వర్షాకాలంలో నారాయణపూర్ నుంచి కిష్టాపూర్ వరకు బురదమయంగా మారే రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పూర్తిగా బురదమయం అవుతుంద ని తెలిపారు. అయినా ప్రజా ప్రతినిధులు పట్టిం చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం ఎన్నికల సమయంలోనే నాయకులకు కిష్టాపూర్ గ్రామ ప్రజలు గుర్తుకు వస్తున్నారని దుయ్యబట్టారు. కిష్టాపూర్‌కు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్‌రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాశ్‌రావు గ్రామస్తులను శాంతింపచేసే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవటంతో చేసేదేమీ లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు.