ఎనిమిదో స్నేహపు వంతెన..
ఢాకా: బంగ్లాదేశ్, చైనాల మధ్య స్నేహబంధం మరింత బలపడనుంది. ఇప్పటికే చైనా, బంగ్లాల మధ్య ఏడు వంతెనల నిర్మాణం పూర్తవగా త్వరలో మరో కొత్త బ్రిడ్జిని నిర్మించుకోవడానికి శుక్రవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నందుకు బంగ్లాదేశ్‌కు, చైనా దాదాపు 340 కోట్ల రుపాయల ఆర్థికసాయం అందజేయనుంది.
ఈ అంశంపై బంగ్లాదేశ్ ఆర్ధిక సహకార శాఖ కార్యదర్శి మెజ్బా ఉద్దీన్, చైనా అంబాసిడర్ మా మిన్యంగ్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని కోచా నది మీద ఎనిమిదో వంతెనను నిర్మించనున్నట్లు దేశ ఈఆర్డీ తెలిపింది. రోడ్లు, నిర్మాణ శాఖ చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం వంతెన పొడవు 1400 మీటర్లని పేర్కొంది. ప్రస్తుతం ఒక గంట ప్రయాణంతో ఫెర్రీ ద్వారా నదిని దాటుతున్నట్లు తెలిపింది. ఈ బ్రిడ్జి ద్వారా బంగ్లాదేశ్‌లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. 1986 నుంచి చైనా, బంగ్లాదేశ్‌కు బ్రిడ్జిలను నిర్మించి ఇస్తోంది.