‘అమ్మ’కు విశ్రాంతి
సాక్షి, చెన్నై :అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి ఏటా నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌కు ముఖ్యమంత్రి జయలలిత వెళుతుంటారు. ప్రతి ఏటా వేసవిలో విశ్రాంతి నిమిత్తం ఆమె అక్కడకు వెళతారు. అధికారంలో లేని సమయంలో ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే వారు. అధికారంలోకి వచ్చాక, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించేవారు. ఇందు కోసం కొడనాడు ఎస్టేట్‌లో మినీ సచివాలయం సైతం ఏర్పాటు చేశారు. వ్యక్తిగత కార్యదర్శులు, ముఖ్య అధికారుల కోసం ఇక్కడ ప్రత్యేక వసతులు ఉన్నాయి.
బిజీబిజీ: లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి క్షణం విశ్రాంతి లేకుండా జయలలిత కష్టపడ్డారు. అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపు బాధ్యతలను స్వీకరించి, రేయింబవళ్లు కష్టపడ్డారు. తన సేనలను ఓ వైపు ప్రజల్లోకి పంపుతూ, మరో వైపు హెలికాప్టర్ ద్వారా గాల్లో చక్కర్లు కొడుతూ బహిరంగ సభల రూపంలో బిజీబిజీగా గడిపారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకునేందుకు జయలలిత నిర్ణయించారు. ఎటూ వేసవి కాలమే కాబట్టి, కొన్నాళ్లు కొడనాడులో గడిపేందుకు నిర్ణయించారు. దీంతో శనివారం కాసేపు సచివాలయంలో గడిపిన ఆమె అనంతరం పోయస్ గార్డెన్‌కు వెళ్లారు. ఆదివారం కొడనాడుకు బయలు దేరడానికి సిద్ధం అయ్యారు.
ఆమె పర్యటన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో ఆమె వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలోని కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లనున్నారు. ఇది వరకు ఆమె వెంట రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు వెళ్లేవారు. అయితే, ఈ సారి వ్యక్తిగత కార్యదర్శుల్ని మాత్రం ఆమె వెంట బెట్టుకెళ్తున్నట్టు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా, కొత్తగా ఏదేని కార్యక్రమాలు చేపట్టేందుకు, ప్రకటనలు, ఉత్తర్వులు ఇచ్చేందుకు వీలు లేదు. ఈ దృష్ట్యా, అధికారులను ఆమె పక్కన పెట్టేశారు. ఫలితాలను వెల్లడించే రోజున, తమకు లభించే ఆదరణ మేరకు ఆమె చెన్నైకు తిరుగు పయనం అయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
ఆస్పత్రుల బాట: జయలలిత విశ్రాంతికి సిద్ధం అయితే, ఆమె సేనలు పలువురు మంత్రులు ఆస్పత్రులబాట పట్టారు. తమ నియోజకవర్గాల పరిధిల్లోని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు తీవ్రంగానే శ్రమించారు. అభ్యర్థి ఓడిన పక్షంలో, ఎక్కడ తమ పదవులు ఊడుతాయోనన్న బెంగ మంత్రులను వెంటాడింది. దీంతో తమ వ్యక్తిగత వ్యవహారాలన్నీ పక్కన పెట్టి, గ్రామాల్లోను, తమకు పట్టున్న ప్రాంతాల్లోనూ తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే విధంగా మంత్రులు, ముఖ్య నాయకులు కుస్తీలు పట్టారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో మంత్రులకు విశ్రాంతి లభించినా, అభ్యర్థి గెలుపు బెంగ వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఓట్ల వేటలో రేయింబవళ్లు పడ్డ శ్రమతో తాజాగా ఆస్పత్రుల బాట పట్టే పనిలో పలువురు మంత్రులు ఉన్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి సంపత్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను చెన్నై థౌజండ్ లైట్స్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైనట్టు గుర్తించారు. ఆయనకు ఇది వరకు ఈ సమస్య ఉన్న దృష్ట్యా, ఆందోళన అవసరం లేదని వైద్యులు తేల్చారు.
విశ్రాంతి తీసుకుంటే, అన్నీ సర్దుకుంటాయంటూ వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో మంత్రి కోయంబత్తూరులో అస్వస్థతకు గురయ్యా రు. పర్యావరణ శాఖ మంత్రిగా తోపు వెంకటాచలం అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్నూ వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మేఘాలయ హోం మంత్రి వజ్రి హృదయ సంబంధిత సమస్యతో థౌజండ్ లైట్స్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.