మోహినీ అలంకారంలో జగదభిరాముడు
- రాములోరి కళ్యాణానికి గవర్నర్, మంత్రులు రాక
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వైభవంగా జరిగిన వాహన సేవ అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిగింది.
కడప–రేణిగుంట జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్కు సమీపంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద సోమవారం రాత్రి రాములోరి కల్యాణం నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు కల్యాణోత్సవానికి విచ్చేయనున్నారు. 70 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేసినప్పటికీ ఒంటిమిట్టకు రెండు లక్షల మంది భక్తులు రానున్నట్లు టీటీడీ అంచనా.