చదువులతల్లి వల్లెలాంబదేవి
సీమ బాసర
కర్నూలు జిల్లాలోని కోడుమూరు పట్టణం హంద్రీనది ఒడ్డున వెలసిన శ్రీవల్లెలాంబదేవి చదువుల తల్లిగా విరాజిల్లుతోంది. అమ్మవారి సన్నిధిలో చదువుకుంటే మంచి మార్కులొస్తాయని, ఉన్నతస్థాయి ఉద్యోగాలొస్తాయని యువతీ యువకుల ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రాంతంలో పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ వల్లెలాంబ ఆశీస్సులు తీసుకొని హాజరవుతుంటారు. వందలాది మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు వల్లెలాంబదేవి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అమ్మ మీద విశ్వాసం వల్ల ఆమెను దర్శించుకునే విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండడంతో కోడుమూరులో వెలసిన శ్రీవల్లెలాంబదేవి సీమ బాసర సరస్వతీదేవిగా విరాజిల్లుతోంది.
మొదటి వల్లె సమర్పించడం వల్లే...
క్రీ.శ.1036లో చాళుక్య రాజు సత్యాశ్రయుని కాలంలో వల్లెలాంబ దేవాలయం నిర్మించినట్లు ఇక్కడి శిలా శాసనం ద్వారా తెలుస్తోంది. గ్రామంలో వస్త్రాలు నేసే వారికి ఈమె కుల దేవత అని, వారు నేసిన మొదటి వల్లెను దేవికి అర్పించేవారు గనుకనే వల్లెలాంబ అని ప్రతీతి. దేవాలయంలో నాటి పండితులు తమ శిష్యులచే వేదాలు వల్లె వేయించేవారు గనుక ఈ దేవికి వల్లెలాంబ అనే పేరు వచ్చిందనేది మరో అభిప్రాయం.
వల్లెలాంబదేవి మహిమలు
గొల్లాపిన్ని కవి పండిత వంశానికి వల్లెలాంబదేవి కుల దేవత. వీరి వంశీయుడైన మోటప్ప అనే బ్రాహ్మణునికి విద్య అబ్బలేదు. నిరక్షరాస్యుడని అందరూ ఎగతాళి చేస్తుంటే సహించలేని అతడు ఓ రోజు రాత్రి వల్లెలాంబ గుడిలో తలుపులు బిగించుకొని కూర్చున్నాడు. రాత్రి వేళలో నగర సంచారానికి వెళ్లి తిరిగి వచ్చిన వల్లెలాంబదేవి గుడి తలుపులు తీయకుండా మొండిగా ప్రవర్తిస్తున్న మోటప్పను కోపంతో హంద్రీనదిలోకి విసిరికొట్టింది. తిరిగి మరుదినం అతడు యధాప్రకారం గుడిలో తలుపులు బంధించుకొని కూర్చున్నాడు. అమ్మవారు తిరిగి అతడిని నదిలోకి విసిరి కొట్టింది. ఇలా మూడు రోజులు జరిగాక మోటప్ప పట్టుదల గమనించి అతని సమస్య తెలుసుకుని సంపూర్ణ అక్షర జ్ఞానం కలిగించడమే కాకుండా ఆ వంశానికి చెందిన ఏడుతరాలు పండిత పుత్రులుగా విరాజిల్లాలని ఆశీస్సులిచ్చినట్లు గొల్లాపిన్ని వంశస్తుల కథనం. గొల్లాపిన్ని వంశస్తులు బెంగళూరు, హైదరాబాద్, నంద్యాల, అనంతపురం ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఏడాదికో రోజు వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్తుంటారు.
- హంపిరెడ్డి, సాక్షి, కోడుమూరు రూరల్ ప్రతినిధి