వంగవీటి ఆశయాలు కొనసాగిద్దాం
ఒంగోలు సబర్బన్ : బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం వంగవీటి మోహన రంగా కృషి చేశారని కాపు సంఘం నాయకులు కీర్తించారు. స్థానిక ఒంగోలులోని రామ్‌నగర్ 1వ లైనులో శనివారం రంగా 68వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ రంగా పేద వర్గాల కోసం చేసిన కృషి మరువలేనిదన్నారు. రంగా ఆశయాలను కొనసాగించాలని.. కాపుల ఐక్యతకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు వారి సంక్షేమం కోసం ఏడాదికి రూ. 1000 కోట్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. హక్కుల సాధనకై గుంటూరులో కాపు నాయకుడు నల్లట విజయరాజునాయుడు శనివారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని, ఆయనకు సంఘీభావం తెలపాలన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ బేతంశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ రంగా ఎదుగుదలను ఓర్చుకోలేని దుండగులు అతనిని అంతమొందించారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాకిరి ధనుంజయ్ మాట్లాడుతూ అటువంటి మహానాయకుడు మళ్లీ పుట్టరన్నారు. నాయకులు తోట శ్రీహరినాయుడు, పసుపులేటి శేషగిరి, నంద్యాల శ్రీనివాసరావు, కాపు కమ్యూనిటీ హాలు అధ్యక్ష, కార్యదర్శులు గాదె వెంకటకృష్ణారావు, ఆరిగ చలమయ్య, కోశాధికారి తోటపల్లి వెంకటరంగారావు, చింతం సుబ్బారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, కుర్రా ప్రసాద్, తోటకూర రామారావు, మంగిశెట్టి కోటేశ్వరరావు, మద్దుల నరసింహారావు, వెలనాటి మాధవరావు, ఓగిరాల రాధాకృష్ణమూర్తి, పసుపులేటి శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, మారెళ్ల శ్రీనివాసరావు, ఉన్నంశెట్టి శ్రీనివాసరావు, చంగలశెట్టి శ్రీనివాసరావు, తోట జాలబాబు, పోకల సత్యం, మన్నెం చక్రవర్తి నివాళులర్పించారు.