ఉదయ్ కిరణ్ మృతిపై కోలీవుడ్ దిగ్భ్రాంతి
యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాలీవుడ్‌నే కాక కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయ్ కిరణ్ తమిళంలో పెణ్ సింగం, పొయ్, వంబుసండై చిత్రాల్లో నటించారు. అలాంటి నటుడి మృతి చాలా మంది తారల్ని ఆవేదనకు గురి చేసింది. పలువురు ఆయనకు నివాళి అర్పించారు. నటి ప్రియమణి మాట్లాడుతూ తాను సోమవారం ఉదయ్ కిరణ్ మరణవార్త వింటూనే నిద్రలేచానన్నారు. తనకు తెలిసిన స్నేహితుల్లో ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఉదయ్ కిరణ్ మరణం తన నెంతగానో బాధించిందన్నారు. నటి విమలా రామన్ మాట్లాడుతూ సినిమాలో తన తొలి హీరో ఉదయ్ కిరణ్ అని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయాం అన్నారు. ఇంకా నటుడు ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ తదితరులు ఉదయ్ కిరణ్ మృతికి సంతాపం తెలియజేశారు.