Yamadheera Review: క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా నటించిన ‘యమధీర’ ఎలా ఉందంటే?
కన్నడ స్టార్ కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా నటించిన తాజా చిత్రం యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వేదాల శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘యమధీర’ కథేంటంటే..
కెపి గౌతమ్ ( కోమల్ కుమార్) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అన్యాయం ఎవరు చేసిన సహించడు. అందుకే ఎక్కడా కూడా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేకపోతాడు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో గొడవ కారణంగా ట్రాన్స్ఫర్స్ అవుతూ చివరికి వైజాగ్ కమిషనర్‌గా వస్తాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేస్తాడు. విచారణలో ఆ యువకుడిని చంపింది అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశ్‌ముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) అని తెలుస్తుంది. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ్ సీఎం అవుతాడు. మరి ఈ కేసును గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? సీఎం దేశ్‌ముఖ్‌కి ఆ హత్యకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం హోదాలో ఉన్న దేశముఖ్ నీ గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి జనాలకి అవగాహన కలిగించే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ యమధీర. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు కానీ ఓ మంచి సందేశాన్ని కమర్షియల్ అంశాలను జోడించి చక్కగా చూపించారు. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్‌లో సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం, శ్రీశాంత్ పాత్ర నిడివి తక్కువగా ఉండడం సినిమాకు మైనస్. శ్రీశాంత్ పాత్ర నిడివి పెంచి, స్క్రిప్ట్‌ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
నటీనటుల విషయానికొస్తే.. హీరోగా కోమల్ కుమార్ నటన చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీకాంత్ చాలా బాగా నటించాడు. రిషిక శర్మ తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ నటన ఆయన పండించిన కామెడీ చాలా అద్భుతంగా ఉంది. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ ఎవరు పరిధికి వారు బాగా నటించారు.
సాంకేతిక విషయాలకొస్తే.. అరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. పాటలు జస్ట్ ఓకే. వరదరాజ్ చిక్కబళ్ళపుర అందించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.