‘మిషన్’కు లీకేజీ
కోమటి కుంట చెరువు తూము నుంచి నీరు వృథా
పట్టించుకోని అధికారులు
కమ్మర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అపహాస్యం పాలవుతున్నాయి. నాణ్యతలోపంతో పనులు చేపట్టడంతో అప్పుడే లీకేజీలు ఏర్పడుతున్నాయి. మానాల గ్రామ పరిధిలోని కోమటి కుంట చెరువు తూముకు లీకేజీ ఏర్పడడంతో నీరు వృథాగా పోతోంది.
మొదటి విడత మిషన్ కాకతీయలో భాగంగా రూ. 35.68 లక్షలతో కోమటి కుంట చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. అధికార పార్టీ నాయకులు ఇద్దరు కలిసి పనులు చేశారు. అధికారులు సరిగా పనులను పరిశీలించలేదన్న ఆరోపణలున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరింది. మంగళవారం ఉదయం తూం నుంచి నీరు లీకయ్యింది. నీటిని నిలువరించడానికి రైతులు షెట్టర్‌ను కిందకు దింపే ప్రయత్నం చేశారు. బోల్ట్ పని చేయకపోవడంతో షట్టర్ కిందికి దిగలేదు. రైతులు తూములో గడ్డి, మట్టి ముద్దలను కుక్కి నీటి వృథాను అరికట్టారు. చెరువు అడుగు భాగం నుంచి షట్టర్ రాడ్లు నిర్మించలేదని రైతులు ఆరోపించారు. తలుపులకు బిగించిన బోల్టులు తిప్పినా బిగుసుకోవడం లేదన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.