జల రవాణాకు కదలిక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అర్ధశతాబ్దం క్రితం ఆగిపోయిన జల రవాణా వ్యవస్థకు మళ్లీ ప్రాణం పోసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. భారత్ జల రవాణా సంస్థ (ఐడబ్ల్యూఏఐ) సహకారంతో రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధికి కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకూ జాతీయ జల రవాణా మార్గం-4 ను పునరుద్ధరించడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. దీని కోసం ఇటీవల విజయవాడలో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు హాజరు కాకపోవడంతో మళ్లీ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు *2,100 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా
అంచనా వేశారు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నైపుణ్యం కలిగిన కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించనున్నారు.
పాండిచ్చేరి నుంచి కాకినాడకు జలరవాణా మార్గం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇందులో ఎక్కువ భాగం రాష్ట్రంలోనే ఉండటం విశేషం.
ప్రకాశం జిల్లాలో నల్లమడ లాకుల నుంచి పెదగంజాం వరకూ కొమ్మమూరు కాల్వ 38 కిలోమీటర్లు ఉంది. ఇది కృష్ణానది జలాలను తీసుకువచ్చే కాలువ. అక్కడి నుంచి పెదగంజాం మీదుగా సముద్రపు ఒడ్డున ఉప్పునీటి కాల్వగా బకింగ్‌హామ్ కెనాల్ ఉంది. పాకల, కరేడు మీదుగా ఇది నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు వరకూ వెళ్తుంది.
కొమ్మమూరు కాల్వ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, బకింగ్‌హామ్ కెనాల్ మాత్రం అవసాన దశకు చేరుకుంది. సముద్రపు ఆటుపోటు ద్వారా వచ్చే నీటితో ఉన్న ఈ కాల్వపై పలుచోట్ల ఓడ వచ్చినపుడు తీయడానికి వీలుగా లాకులు, దీన్ని ఆపరేట్ చేయడానికి లస్కర్ల వ్యవస్థ ఉంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించకపోవడంతో ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి.
జిల్లాలో 43 కిలోమీటర్ల మేర ఉన్న బకింగ్‌హామ్ కాల్వను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. 2008 నవంబర్లోనే రైట్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ జలరవాణా వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేసింది.
కాకినాడ - పాండిచ్చేరి మధ్య సుమారు 1,095 కిలోమీటర్ల పొడవునా జలరవాణా వ్యవస్థ ఏర్పాటుకు కాలువలు, నదులు అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా వెళ్లింది. అప్పట్లోనే *1,516 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది.
2009-2010 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రాథమికంగా *62 కోట్లను జలరవాణాకు కేటాయించి, 2013 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించింది. కానీ తర్వాత జలరవాణా మార్గం అభివృద్ధి మరుగునపడింది. రాష్ట్రంలో పోర్టుల అనుసంధానం, కోస్తా కారిడార్ ఏర్పాటు నేపథ్యంలో జలరవాణా మళ్లీ తెరపైకి వచ్చింది.
కాకినాడ-పాండిచ్చేరి జలరవాణా మార్గం వల్ల ఏటా 11 మిలియన్ టన్నుల కార్గో రవాణా అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆరేళ్ల క్రితం సర్వే చేసిన వెప్కాస్ అనే సంస్థ తెలియజేసింది. మూడు రాష్ట్రాల మధ్య బియ్యం, బొగ్గు, ఆహార పదార్థాలు, సిమెంట్, ఎరువులు, అటవీ ఉత్పత్తులు, ఉప్పు తదితర వాటిని రవాణా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటన్నింటినీ రైళ్లలో రవాణా చేయడం వల్ల భారమవుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మళ్లీ జలరవాణా అందుబాటులోకి రావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.