ఘోర రోడ్డు ప్రమాదం
కొణకంచి క్రాస్‌రోడ్స్(పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొణకంచి క్రాస్‌రోడ్స్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. నందిగామ వైపు నుంచి జగ్గయ్యపేటకు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, జగ్గయ్యపేట వైపు నుంచి కొణకంచి గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డును క్రాస్ చేస్తున్న లారీ మధ్యలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో సంఘటనా స్థలంలో ఆటోలో ప్రయాణిస్తున్న నందిగామకు చెందిన చవట వీరభద్రరావు(69)అనే వ్యాపారి తలకాయ పగిలి మృతి చెందాడు. అలాగే నందిగామ మండలం ఐతవరంకు చెందిన సూరబోయిన పద్మ, సాయికృష్ణ, లింగబోయిన వెంకటేశ్వరరావు, చుండు హనుమంతరావు, సుబ్బారావు, సామ్రాజ్యమ్మ, జగ్గయ్యపేట మండలం గౌరవరానికి చెందిన పఠాన్ నాగుల్‌మీరా, తిరుపతికి చెందిన దొండపాటి నారాయణమూర్తితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో ఐదేళ్ల సాయితో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరభద్రరావు మృతదేహాన్ని నందిగామ ఆస్పత్రికి పోస్టుమార్టమ్ కోసం తరలించగా, స్థానిక ఎస్ఐ ఏ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.