ఆశ్రమపాఠశాల విద్యార్థి ఆత్మహత్య
సెల్‌చార్జర్ చోరీ చేశాడని మందలించిన వార్డెన్
మనస్తాపంతో బాలుడి అఘాయిత్యం
సిబ్బందిపై బంధువుల దాడి
కోనరావుపేట: మెుబైల్ చార్జర్ చోరీ చేశాడనే కారణంపై వార్డెన్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట గిరిజన ఆశ్రమపాఠశాలలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వన్‌పల్లి బండమీది తండాకు చెందిన భుక్యా స్వామి (11) తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. దీంతో ఆయనను మేనత్త హంసి–రాములు చేరదీశారు. కోనరావుపేట గిరిజన ఆశ్రమపాఠశాలలో చేర్పించారు. స్వామి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం మెుబైల్‌ఫోన్ చార్జర్ చోరీ చేశాడనే కారణంతో వార్డెన్ ఆంజనేయులు స్వామికి బుద్ధిచెప్పారు. తోటి విద్యార్థుల ఎదుట ఇలా చేయడంతో అవమానంగా భావించిన స్వామి కృష్ణాష్టమి కోసం తనకు మూడురోజుల సెలవు కావాలని ఈనెల 24న సెలవు పెట్టాడు. శనివారం పాఠశాల భవనం మూడో అంతస్తులోని గదిలోంచి దుర్వాసన వచ్చింది. విద్యార్థులు వెళ్లి చూడగా స్వామి కిటికీకి ఉరివేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని సిబ్బంది, గ్రామస్తులకు అందించారు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థి మృతి కారణమంటూ వార్డెన్ ఆంజనేయులు, సిబ్బందిపై దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని పాఠశాల ఎదుట ధర్నా చేశారు. సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, తహసీల్దార్ గంగయ్య, డీటీడబ్ల్యూవో ఎర్రయ్య, ఎంపీపీ సంకినేని లక్ష్మి, సర్పంచ్ సుమలత, వేములవాడ రూరల్ సీఐ మాధవి పాఠశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు. వార్డెన్‌తోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విద్యార్థి మృతిపై పూర్తిస్థాయివో విచారణ చేపడతామని చెప్పారు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ , డబుల్ బెడ్రూం పథకాలు అందేలా చూస్తామన్నారు. వారి జీవనోపాధి కోసం భూమిని కూడా కేటాయిస్తామని ఆర్డీవో పేర్కొన్నారు.