వేలంలో ల్యాంకో, దబోల్ ప్రాజెక్టులకు గ్యాస్
న్యూఢిల్లీ: ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు తాజా వేలంలో గణనీయ స్థాయిలో గ్యాస్‌ను దక్కించుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ గ్యాస్‌ను ఈ వేలానికి పెట్టగా 3.11 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ల్యాంకో సంస్థకు దక్కింది. దబోల్ ప్రాజెక్ట్ 2.43 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ 9.93 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను ఆరు నెలల పాటు మార్చి వరకు సరఫరా చేసేందుకు వీలుగా శనివారం వేలం నిర్వహించింది. 9 ప్లాంట్లు తక్కువ బిడ్డర్లుగా జాబితాలో నిలిచి గ్యాస్ కేటాయింపులను దక్కించుకున్నాయి.
పయోనీర్ గ్యాస్ పవర్‌కు 1.08, జీఎంఆర్ వేమగిరి పవర్ జనరేషన్‌కు 1.03 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ లభించింది. జీవీకే ఇండస్ట్రీస్‌కు కూడా 0.63 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్, పాండురంగ ఎనర్జీ సిస్టమ్స్‌కు 0.32 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ కోటా లభించింది. ఆరు నెలల కాలంలో ఈ తొమ్మిది విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 881 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేయడంతోపాటు యూనిట్‌ను రూ.4.70 అంతకంటే తక్కువ ధరకు సరఫరా చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.