వర్మ.. వస్తున్నాం కాసుకో!
పిఠాపురం : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు మీరు సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ తరుఫున ప్రజల్లోకి వస్తున్నాం కాసుకో.. అంటు మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నేత కొప్పన మోహనరావు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు సవాల్ విసిరారు.
వైఎస్సార్ సీపీలో చేరి తొలిసారిగా పిఠాపురం విచ్చేసిన సందర్భంగా ఆయన స్వగృహంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వర్మపై నిప్పులు చెరిగారు. వర్మ అరాచక పాలనపై ఒంటరి పోరాటం చేసిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబుకు కొండంత అండగా ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి నేటి నుంచి కంకణం కట్టుకున్నట్లు ఆయన ప్రకటించారు.
వితంతవుల పింఛన్లు సైతం కాజేయడానికి కార్యకర్తలను, నాయకులను బతికుండగానే చంపుకుంటూ నీచాతినీచంగా దిగజారిపోయిన వర్మకు పిఠాపురం నియోజకవర్గంలో పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరాచకపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, ఆయన చేయించుకున్న సర్వేలే అందుకు నిదర్శనమన్నారు.
ప్రజలనేత వైఎస్ జగన్
తండ్రి ఆశయ సాధనకు ప్రజల పక్షాన అవిరళ కృషి చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం తనను పార్టీ వైపు వచ్చేలా చేసిందని కొప్పన మోహనరావు తెలిపారు. జగన్ నేతృత్వంలో పెండెం దొరబాబుకు అండగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని తిరుగులేని పార్టీగా నిలబెట్టడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. కొప్పన రాకతో పార్టీకి నూతనోత్సాహం వచ్చిందని ఆయన సహకారంతో జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేసి పార్టీ తరుఫున ప్రజలకు అండగా ఉంటామని పెండెం దొరబాబు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, అబ్బిరెడ్డి వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య తదితరులు పాల్గొన్నారు.
కొప్పనకు ఘన స్వాగతం
హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చిన కొప్పనకు పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా కాల్పులతో భారీ ర్యాలీగా ఆయనను పిఠాపురం మండలం జల్లురు నుంచి తీసుకువచ్చారు.