భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
కంచిలి: భార్య కాపురానికి రాలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కంచిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జలంత్రకోటకి చెందిన సౌరాసి లక్ష్మణ్(35) వలస కూలి. చెన్నైలో కూలి పని చేస్తూ బతుకు సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ఈశ్వరి కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ స్వగ్రామంలో నివాసం ఉండకపోవడంతో అతని భార్య ఈశ్వరి తన కన్నవారింట్లో సోంపేట మండలం కొరంజిభద్రలో కుమారుడుతో కలసి ఉంటోంది. చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చిన లక్ష్మణ్ భార్య దగ్గరకు వెళ్లాడు. తనుతో పాటు రావాలని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. కనీసం కుమారుడినైనా తనతో పంపించాలని కోరాడు. అందుకూ ఈశ్వరి ఒప్పుకోలేదు.
దీంతో భార్యభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. లక్ష్మణ్ శనివారం రాత్రి లక్ష్మణ్ తన ఇంటికి తిరిగొచ్చేశాడు. తీవ్ర మనస్థాపం చెందిన అతడు ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి అతగాడిని 108లో సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. తాను ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం మా ఇద్దరి మధ్య గొడవలే అని లక్ష్మణ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఈశ్వరి నుంచి కూడా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కంచిలి ఎస్ఐ కె. వెంకటసురేష్ తెలిపారు.