ఎవరికీ పట్టని ‘సర్కార్ ఇస్కూల్’
సమస్య తెలిపినా స్పందించని పాలకులు
కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. గుడిసెలోనేకొనసాగుతున్న పాఠశాల
బిక్కుబిక్కుమంటూ అక్షరాలు దిద్దుకుంటున్న చిన్నారులు
కౌడిపల్లి:గాలొస్తే ఊగిపోతుంది...వర్షమొస్తే ఉరుస్తుంది..ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి...ఇది మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధిలోని కొర్రసీత్యతండాలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి. ఇలాంటి పాఠశాలకు ఎవరైనా తమ పిల్లలను పంపుతారా...కానీ తప్పక, మనసొప్పక పోయినా నాలుగు అక్షరాలు నేర్చుకుంటారన్న ఆశతో ఆ తండా వాసులు తమ పిల్లలను కూలేందుకు సిద్ధంగా ఉన్న బడికే పంపుతున్నారు. సమస్య చెబితే విచారించి చర్యలు చేపడతామనే అధికారులు పూర్తి వివరాలతో విద్యార్థులు పడుతున్న కష్టాన్ని వివరించినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
గిరిజనం గోడు పట్టదా...
మండలంలోని మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధిలోని కొర్రసీత్యతండాలోని ప్రాథమిక పాఠశాల కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గుడిసెలో కొనసాగుతున్న విషయాన్ని ఈ నెల 14 ‘సాక్షి’ ‘సర్కార్ ఇస్కూల్’ పేరిట కథనాన్ని ప్రచురించిన సంగతి విధితమే. ఈ కథనాన్ని చదివిన జిల్లా ప్రజానీకం చలించిపోయినా, పాలకుల మనసుమాత్రం కరగలేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న గుడిసెలో కొనసాగుతున్న పాఠశాల గురించి అరిచి గీపెట్టినా ఎవరూ పట్టించుకోలే దు. అటు విద్యాశాఖ అధికారులు గాని, పాలకులు కనీసం ఆ తండా వైపు తొంగి చూడ లే దు. ఓవైపు తండాలను పంచాయతీలు గా మారుస్తాం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళిత, గిరిజనులను ఉద్ధరిస్తామం టూ రోజూ తమ ప్రసంగాలతో ఊదరగొడుతున్న నాయకులు సైతం కొర్రసీత్యతండా వైపు కన్నెత్తి చూడలేదు.
ఈ నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు
పాఠశాల నిర్వహణకు కనీసం గుడిసె కూడా ఏర్పాటు చేయని విద్యాశాఖ తీరును కొర్రసీత్య తండా వాసులు తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికీ తండాలపై నిర్లక్ష్యమేనంటున్నారు. శుక్రవారం పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కొర్ర రాజునాయక్, వార్డుసభ్యుడు కొర్ర బద్రునాయక్, పీర్యనాయక్, హీర్యా నాయక్ తదితరులు తండాలో విలేకరులతో మాట్లాడుతూ, తండాలో పదిహేనేళ్ల క్రితం పాఠశాలను ఏర్పాటు చేయగా, ఇంతవరకూ పక్కా భవనాన్ని నిర్మించకపోవడం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. గత సంవత్సరం సైతం తామే పాఠశాలకు మరమ్మత్తులు చేయించుకున్నామన్నారు. గిరిజనులపై ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్షానికి ఇదే నిదర్శనమన్నారు. కొర్రసీత్యతండా పాఠశాలకు పక్కభవనం నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఇక్కడి విద్యార్థులతోపాటు, సమీపంలోని ఎర్రసీత్యతండా, కుర్మవాడ విద్యార్థులు సైతం ఇక్కడి పాఠశాలకు వస్తారని తెలిపారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి తమ తండాలోని పాఠశాలకు పక్కా భవనం మంజూరు చేయడంతో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయున్ని నియమించాలని వారు కోరారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా త్వరలో మరమ్మత్తులు చేయిస్తామన్నారు.