కోషి నదిపై... బంగీ ఖుషీ
నేపాల్
అటూ ఇటూ ఎత్తై కొండలు. మధ్యలో ప్రవహించే కోషి నది. ఆ కొండల మధ్యలో 560 అడుగుల ఎత్తులో వేసిన ప్లాట్‌ఫామ్ నుంచి కాళ్లకు తాడు తప్ప మరేమీ ఆధారం లేకుండా కిందికి దూకేస్తే? దూకే వరకూ భయమే. కానీ ఆ తరవాత ఉండే థ్రిల్... ఒక జీవితానికి సరిపోతుంది. అందుకే... బంగీ జంప్ కోసం నేపాల్‌కు విదేశీయులూ పెద్ద ఎత్తున వస్తుంటారు. నిజానికి బావగారూ బాగున్నారా... సినిమాలో చిరంజీవి బంగీ జంప్ చెయ్యటాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆఖరికి చిరంజీవి కూడా. అసలు బంగీజంప్ అంటే మొదట గుర్తొచ్చేది చిరంజీవి చేసిన న్యూజిలాండే. కానీ మనకు పక్కనే ఉన్న నేపాల్లోనూ ఈ అవకాశం ఉంది. న్యూజిలాండ్ బంగీ నిపుణులే దీన్నీ ఏర్పాటు చేశారు.
నేపాల్‌కు వెళ్లేదెలా?
* అంతర్జాతీయ ప్రయాణికులెవరైనా విమానంలో వెళితే ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాల్సిందే. స్థానికంగా చిన్న చిన్న విమానాలు, విమానాశ్రయాలతో నేపాల్ మొత్తానికి విమాన ప్రయాణ సౌకర్యాలున్నాయి.
* హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు లేవు. ఢిల్లీ నుంచి మాత్రం 1.45 గంటల ప్రయాణం. కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే ఛార్జీలు ఒకరికి రూ.12వేలలోపే ఉంటాయి.
* రోడ్డు మార్గంలో వెళ్లటానిక్కూడా నేపాల్ అనుకూలమే. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ల ద్వారా నేపాల్‌కు వెళ్లొచ్చు. క్యాబ్‌లు, కార్లతో నేరుగా ప్రవేశించొచ్చు. భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డు మాత్రం తప్పనిసరి.
* నేపాల్‌కు మన దేశం నుంచి రైలు కూడా నడుస్తోంది. 1994లో ఈ రైలు ఆరంభమైంది. ఇది బీహార్‌లోని జయనగర్ నుంచి బయలుదేరి ఖాట్మండులోని జనక్‌పూర్ ధామ్ వరకూ వెళుతుంది.
* మంచుకొండల్లో ఉండే నేపాల్ చాలా అందమైన దేశం కనక అక్కడికి వెళ్లినవారు కోషి బంగీజంప్కు వెళ్లేదాకా మిగతా ప్రాంతాల్ని చూడొచ్చు. కోషిపై బంగీజంప్ నిర్వహించే ప్రాంతం... నేపాల్- టిబెట్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడికి బస్సులో దాదాపు 3 గంటల ప్రయాణం.
ఏ సీజన్ అనుకూలం?
మార్చి- మే: వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. పెద్దగా చలి, ఎండ ఉండవు. పర్వతారోహణకిదే సరైన సమయం. ఇక్కడ రకరకాల పుష్పాలు వికసించేదీ ఇప్పుడే. టూరిస్టుల సంఖ్యా ఎక్కువే.
జూన్- ఆగస్టు: ఎండాకాలం, వర్షాకాలం కలిసే ఉంటాయి. రోజూ వర్షం పడటం... బాగా వేడిగా ఉండటం చూడొచ్చు. ఈ సమయంలో టూరిస్టుల తాకిడి తక్కువ.
సెప్టెంబరు- నవంబరు: వేసవి వెళిపోతుంది. శీతాకాలం రావటానికింకా సమయం ఉంటుంది. ఇదే పర్యాటకులకు బెస్ట్ సీజన్.
డిసెంబరు- ఫిబ్రవరి: చలికాలం. రాత్రిళ్లు, ఉదయం చలి ఎక్కువ. ట్రెక్కింగ్‌కు ఇది మంచి సీజన్.