కోస్ట్‌గార్డు స్టేషన్ ప్రారంభం
నిజాంపట్నం: సముద్ర తీరప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తీరప్రాంత రక్షణ చర్యల్లో భాగంగా నిజాంపట్నంలో మంగళవారం కోస్ట్‌గార్డు స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇండియన్ కోస్ట్‌గార్డు డెరైక్టర్ జనరల్ అనురాగ్ జి తప్లియాల్ స్టేషన్‌ను ప్రారంభించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
2008లో ముంబై తీర ప్రాంతం నుంచి ఉగ్రవాదులు నగరంలోకి చొరబడి సృష్టిం చిన హింసాకాండను ఎప్పటికీ మరువలేమన్నారు. అలాంటి ఘటనలకు తావు లేకుండా తీరంలో పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన కోస్ట్‌గార్డు స్టేషన్ తీరప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగిస్తుందని చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీరప్రాంతంలోని ప్రజల రక్షణకు కోస్ట్‌గార్డు సిబ్బంది పూర్తి సహాయసహకారాలు అందిస్తారన్నారు.
హుదూద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ నష్టం సంభవించకుండా కోస్ట్‌గార్డ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారన్నారు.
నిఘా విషయంలో మత్స్యకారుల సహకారం కీలకమైందన్నారు. దేశరక్షణకు మత్స్యకారులు అంకిత భావం తో సమాచారం అందించి సహకరించాలని కోరారు.
సముద్రంలో వేట చేస్తున్న సమయంలో అపరిచిత బోట్లు, వ్యక్తులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన మత్స్యకారులకు సూచించారు.
15 వేల మంది జనాభా ఉన్న నిజాంపట్నం పంచాయతీ పరిధిలో కోస్ట్‌గార్డు స్టేషన్ ఏర్పాటు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తొలుత కోస్ట్‌గార్డు సిబ్బంది గౌరవవందనం స్వీకరించారు. జాతీయ జెండా, కోస్ట్‌గార్డు జెండాలకు వందన సమర్పణ చేశారు.అనంతరం కోస్ట్‌గార్డు స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ కోస్ట్‌గార్డు ఐజి ఎస్పి.శర్మ, కోస్ట్‌గార్డు డీఐజీ శబర్వాల్, కోస్ట్‌గార్డు అధికారి ఏకేఎస్ పన్వర్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.