ఇక్కడ గర్భిణులు ఆడుతారు, పాడుతారు, వ్యాయామం చేస్తారు...
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం / భద్రాచలం : ఇక్కడ గర్భిణులు ఆడుతారు.. పాడుతారు.. వ్యాయామం చేస్తారు. ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా భయపడరు. సాధారణ ప్రసవం అవుతామనే ధీమా అందరిలోనూ కనిపిస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు మించిన మిషనరీలు, వైద్య సిబ్బంది సేవలు ఈ ఆస్పత్రి సొంతం. ఇక్కడ గత రెండేళ్లుగా గర్భిణులు, శిశు మరణాల సంఖ్య ఒకటి, రెండుకు మించి లేకపోవడం విశేషం. అందుకే జిల్లా నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్.పురం, కుక్కునూరు, వేలేరుపాడు, యటపాక మండలాల వారు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సైతం గర్భిణులు సుఖ ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. సామాన్యులే కాదు.. వీఐపీలకూ ఈ ఆస్పత్రిపై అపార నమ్మకం. ప్రస్తుత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల సతీమణులు కూడా ఈ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయించుకోవడం గమనార్హం. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై అన్ని వర్గాల వారిలోనూ భరోసా రోజురోజుకూ పెరుగుతోంది.
చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే
మార్పు తెచ్చిన ‘మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ సిస్టం’
సరిగ్గా రెండేళ్ల క్రితం.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 80 శాతం ప్రసవాలు ఆపరేషన్లే జరిగేవి. ఈ ఆస్పత్రితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి, కాగజ్‌నగర్, ఏటూరునాగారం, పెద్దపల్లి, కోస్గి సీహెచ్‌సీలు, మంచిర్యాల, మహబూబాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, గజ్వేల్, భద్రాచలం ఏరియా ఆస్పత్రులు, ఎంసీహెచ్ కరీంనగర్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువని తేలింది.
చదవండి: విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు..
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులతో వ్యాయామం చేయిస్తున్న మిడ్వైఫ్ ప్రాక్టీషనర్లు
దీంతో ఆయా ఆస్పత్రుల్లో తల్లీ బిడ్డల మరణాల రేటు తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో 2017లో ప్రభుత్వం ‘నర్స్ మిడ్వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్’ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 దరఖాస్తులు రాగా 30 మందిని ఎంపిక చేసి, వారికి కరీంనగర్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 12 నెలలు, సంగారెడ్డి ఎంసీహెచ్‌లో ఆరు నెలలు, మరో చోట ఆరు నెలలు.. ఇలా మొత్తం రెండేళ్ల పాటు శిక్షణ ఇప్పించింది. అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న 12 ఆస్పత్రులకు ఇద్దరు, ముగ్గురు చొప్పున నియమించింది.
1,250 సాధారణ ప్రసవాలు
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 1,984 ప్రసవాలు జరిగాయి. అందులో 1,250 సాధారణ ప్రసవాలే ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల వారీగా చూస్తే.. సాధారణ కాన్పుల్లో ‘భద్రాచలం ఏరియా ఆస్పత్రి’ మొదటి స్థానంలో ఉండడం విశేషం. కాగా రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్య దేవరాజన్, సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్ గతంలో ఈ ఆస్పత్రిని సందర్శించారు. మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ల పనితీరును స్వయంగా తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో గర్భిణుల వివరాలు తెలుసుకుంటున్న వాకాటి కరుణ, ఐటీడీఏ పీఓ (ఫైల్)