జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్
తెలంగాణ కోసం అనుక్షణం పరితపించిన మహనీయుడు
స్పీకర్ మధుసూదనాచారి
కేయూ జంక్షన్లో ‘సార్’ విగ్రహావిష్కరణ
నయీంనగర్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జీవితాంతం కాలంతో పోటీపడుతూ తెలంగాణ కోసంపోరాడి అగ్రస్థానంలో నిలిచిన మహావ్యక్తి అని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండలోని కేయూ జంక్షన్లో ప్రొఫెసర్ జయశంకర్ మెమోరియల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత జయశంకర్ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తన కర్తవ్య నిర్వహణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం అనుక్షణం పరితపించిన మహామనిషి జయశంకర్‌సార్ అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష సమయంలో తప్ప అన్ని సమయాల్లో జయశంకర్ సలహాలతోనే పని చేశారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి ఉద్యమ ఎత్తుగడలను, వ్యూహ, ప్రతివ్యూహాలను సుధీర్ఘంగా చర్చించి, దిశా, నిర్దేశం చే సేవాడన్నారు.
తాము ఏదైనా కేసీఆర్‌తో చెప్పదలుచుకుంటే జయశంకర్ ద్వారా మాత్రమే చెప్పేవారమన్నారు. ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ విముక్తి కోసం అనేక విధాలుగా ప్రజలను చైతన్యపరిచారని గుర్తుచేశారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వచ్ఛదంగా జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
కేయూ జంక్షన్‌కు జయశంకర్ చౌరస్తాగా అధికారికంగా నామకరణం చేసి, అన్నివిధాల అభివృద్ధి చేసేలా నగరపాలక సంస్థ కమిషనర్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులతో చర్చించి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకున్నప్పుడే జయశంకర్ ఆశయాలు నెరవేరుతాయన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మ మాట్లాడుతూ నూతన రాష్ర్టంలో జయశంకర్ ఆయాలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్‌తో తమ కుటుంబానికి 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన అనుక్షణం తెలంగాణ రాష్ట్రం విముక్తి కోసం మాత్రమే ఆలోచించేవాడన్నారు. మాజీ మంత్రి ప్రణయభాస్కర్ అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్చరించినప్పుడు సీమాంధ్ర పాలకులు అవమానిస్తే, తన పదవికి రాజీనామా చేసినప్పుడు స్వయంగా జయశంకర్ సార్ అభినందించార ని గుర్తుచేశారు.
ఆ తర్వాత ప్రణయ్ మిత్రమండలికి గౌరవసలహాదారుడిగా ఉంటూ తెలంగాణ ప్రజలను అనునిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి నాయకులు బక్కి యాదగిరి, రావుల జగదీశ్వరప్రసాద్, ఠాకూర్ రతన్‌సింగ్, నాగభూషణం, సర్వేశం, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పమ్మి రమేష్, ఎంజాల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథులను శాలువాలు, జయశంకర్ మెమోంటోలతో ఘనంగా సన్మానించారు.