‘లైన్’లో పడ్డట్టేనా..!
కోటిపల్లి-నర్సాపురం ప్రాజెక్టుకు రూ.200 కోట్లు
మెయిన్‌లైన్‌తో కాకినాడ అనుసంధానానికి రూ.50 కోట్లు
రైల్వే బడ్జెట్లో మంత్రి జిల్లాపై చూపిన కరుణ అంతే..
కొత్త రైళ్లు, ప్రధాన రైళ్ల హాల్ట్‌ల ఊసే లేదు
బడ్జెట్‌పై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయూలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ:జిల్లావాసుల చిరకాలపు ఆకాంక్షల్ని ప్రతి రైల్వేబడ్జెట్‌లో పరిహసిస్తున్న కేంద్రప్రభుత్వం.. ఈసారి కొంతలో కొంత పరిగణనలోకి తీసుకున్నట్టే ఉంది. దశాబ్దాలుగా కన్న తమ కలలు సాకారం కావడంలో ఇకనైనా సర్కార్లు చిత్తశుద్ధిని కనబరచాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. పచ్చని కోనసీమకు రైలుమార్గం యోగం కల్పించే సుమారు 60 కిలోమీటర్ల కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను పనులకు ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. దీనికి మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంది. కాగా 1999-2000లోనే ఆమోదముద్ర పడినా, ముందుకు కదలని కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ పనులకు కూడా ఈ బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు.
అంతేమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేస్తే ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు సమకూరినట్లే. రెల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రెండు లైన్లకు ఆ మేరకు నిధులు మంజూరు చేయడం తప్ప జిల్లాకు కొత్త రైళ్లను ప్రకటించలేదు. కాగా జిల్లాలోని రెండు లైన్లకు రూ.200 కోట్లు, రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంపై భిన్నాభిప్రాయూలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అరకొర కేటాయింపులనీ, జిల్లాకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు అంటుండగా.. టీడీపీ, బీజేపీ వారితో పాటు కోనసీమవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు రూ.345 కోట్లు.. ఇప్పుడు రూ.2 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే కోటిపల్లి-నర్సాపురం లైన్ పనులకు ఈ ఏడాది రూ.400 కోట్లు సమకూరినట్లే. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అంచనా వ్యయం రూ.345 కోట్లే. 2002, నవంబరు 16న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో దీనికి పునాదిరాయి వేశారు. కానీ గత బడ్జెట్లలో కేటాయించింది రూ.70 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రాథమిక పనులు పూర్తవుతాయి. ఈ లైను పనుల్లో అతి పెద్ద సవాలు గోదావరి పాయలైన గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై భారీ రైలు వంతెనలు నిర్మాణమే. వీటి పనులను త్వరితగతిన ప్రారంభిస్తే వచ్చే మూడేళ్లలో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
రాష్ట్ర సర్కారూ నిధులిస్తేనే పనులు..
జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడను చెన్నై-హౌరా ప్రధాన రైలు మార్గంతో అనుసంధానం చేయడమే కాకినాడ-పిఠాపురం ప్రాజెక్టు లక్ష్యం. 21 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైను నిర్మాణానికి తొలుత అంచనా వ్యయం రూ.126 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రూ.250 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం కేటారుుంచిన రూ.50 కోట్లకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తే మొత్తం రూ.100 కోట్లతో ప్రాజెక్టులో చాలాపనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.
స్టేషన్ల అభివృద్ధికి ఎంపీల కృషే కీలకం..
జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడతో పాటు వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరం, పుణ్యక్షేత్రమైన అన్నవరం రైల్వే స్టేషన్లతో పాటు సామర్లకోట, తుని, పిఠాపురం, అనపర్తి స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కానీ స్టేషన్ల అభివృద్ధి కోసం వెచ్చించే నిధులు ఆయా స్టేషన్లకు దక్కేలా జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులే కృషి చేయాలి.
మూడో ట్రాక్ వస్తే కొత్త రైళ్లు..
ప్రస్తుతం విస్తరణ జరుగుతున్న 216 నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా కొత్తగా రైల్వే లైను నిర్మించాలని దీర్ఘకాలంగా డిమాండ్ ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులకే రైల్వే మంత్రి ముందు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ప్రతిపాదన కాస్తా తెరవెనుకకు పోయింది. అయితే చెన్నై-హౌరా ప్రధాన రైల్వే మార్గంలో దువ్వాడ (విశాఖపట్నం)-విజయవాడ, విజయవాడ-గూడూరుల మధ్య మూడో ట్రాక్ పనులకు వరుసగా రూ.50 కోట్లు, రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. దీంతో మూడో ట్రాక్ నిర్మాణపనులు పుంజుకుంటాయి. ఇది పూర్తయితే విశాఖ-విజయవాడ మధ్య కొత్త రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుంది. ఈ లైనులో ఉన్న తుని, అన్నవరం, సామర్లకోట, అనపర్తి వంటి రెండో శ్రేణి రైల్వేస్టేషన్లలో ప్రధాన రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించవచ్చు. ఈ బడ్జెట్లో ప్రకటించిన విజయవాడ-విశాఖ డబుల్ డెకర్ రైలుకు రాజమండ్రితో పాటు సామర్లకోట, అన్నవరం, తుని వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్ కల్పిస్తే జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.