కోట్‌పల్లి ప్రజల కల నెరవేర్చండి
కోట్‌పల్లి మండలంగా ప్రకటించండి
డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి
పెద్దేముల్: ‘పదవులు.. నిధులు.. అడగటం లేదు.. 30 ఏళ్లుగా కోట్‌పల్లి గ్రామ ప్రజలు కల నెరవేర్చండి.. మండలంగా ప్రకటించండి..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కోట్‌పల్లి మండలంగా ప్రకటించాలని కోరుతూ ఆ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటితో 9వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షల్లో డ్వాక్రా మహిళలు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలకు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్ మహరాజ్, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరి స్వరూప, సీసీఐ రాములు, వెంకటచారి, శ్రీనివాస్‌చారి, నర్సింలు, లక్ష్మన్, గయాజ్, ముజీబ్ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోట్‌పల్లిని మండల కేంద్రంగా ప్రకటించకపోతే జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిని అడ్డుకుంటామని, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామమన్నారు.
1983లో కోట్‌పల్లి మండల కేంద్రంగా ప్రకటించాల్సి ఉండగా.. రాజకీయ ఒత్తిళ్లతో బంట్వారాన్ని మండల కేంద్రంగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్‌పల్లి గ్రామ ప్రజలు తొమ్మిది రోజుల నుంచి రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నా ప్రభుత్వానికి ఎందుకు చలనం రాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి మహేందర్‌రెడ్డి చొరవ తీసుకుని కోట్‌పల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోట్‌పల్లిని మండల కేంద్రంగా చేయకపోవడం ఇది రాజకీయ నాయకుల కుట్ర అని, తాండూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాజుగౌడ్ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఇన్చార్జి ఎల్లారెడ్డి, ప్రవీణ్ పటేల్, యాలాల మండల ఇన్చార్జి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.