కియా మోటార్స్ ఎక్కడికీ తరలిపోదు: కోట్రా
సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందన్న ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా- ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ(కోట్రా) ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని స్పష్టం చేసింది. కియా పరిశ్రమను తరలించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టింది. ఆసియా కమ్యూనిటీ న్యూస్ (ఏసీఎన్) నెట్వర్క్ కియా తరలిపోతుందన్న కథనం రాయగా.. కోట్రా దానిని ఖండించింది. దీంతో ఈ అంశంపై స్పష్టతనిస్తూ ఏసీఎన్ బుధవారం తాజాగా ఈ మేరకు మరో ప్రకటన విడుదల చేసింది.(చదవండి: బాబు ‘వలస’ బంధం ‘రాయిటర్స్’)
కాగా కియా పరిశ్రమను ఏపీ నుంచి తరలిస్తున్నారంటూ రాయిటర్స్ పేర్కొన్న కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటుగా.. సంస్థ కూడా ఖండించిన విషయం తెలిసిందే. అసత్య కథనాలపై స్పందించిన కియా మోటర్స్ ఎండీ కుక్యున్ షిమ్... దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో కియా యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని... తప్పుడు వార్తలు రాసిన రాయిటర్స్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు గతంలో ఆయన లేఖ రాశారు.(కియాపై కీలక ప్రకటన..)