నెల్లూరు జిల్లాలో లాకప్‌డెత్?
► విచారణ పేరుతో కొట్టి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
కోవూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు బుధవారం అర్ధరాత్రి లాకప్‌డెత్‌కు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి కుటుంబ సభ్యులు దీనిపై ఆందోళన చేపట్టారు. స్థానిక రుక్మిణీ కల్యాణ మండపం సమీపంలో మంగళవారం ఓ వృద్ధురాలి చెవి కమ్మలు చోరీకి గురయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పెళ్లకూరు కాలనీకి చెందిన వెన్నపూస రమణయ్య(43)ను అనుమానిస్తూ బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో రమణయ్య నోటి నుంచి నురగలు కక్కుతూ కూప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. పోలీసులు రమణయ్యను విచారణ పేరుతో లాఠీలతో కుళ్లబొడవటంతో మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు వైద్యశాల వద్ద ఆందోళనకు దిగారు.
స్థానిక ఎస్సై వెంకటరావు మాట్లాడుతూ రమణయ్య ఇటీవల కాలంలో ఇందుకూరుపేటలో సైతం మహిళ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో మెడల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడి రిమాండ్‌కు వెళ్లి విడుదలై వచ్చాడని తెలిపారు. అలాంటి నేరమే మళ్లీ ఈ ప్రాంతంలో జరగడంతో రమణయ్యను అనుమానిస్తూ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించామని ఎస్సై వివరించారు. అతన్ని తాము కొట్టలేదని, అతని మృతికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.