ఘనంగా ఖాదర్‌లింగ ఉరుసు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున 3 గంటలకు దర్గా ధర్మకర్త సయ్యద్‌సాహెబ్ పీర్ చిష్తి ఇంటి నుంచి ఊరేగింపుగా గంధాన్ని దర్గాకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా పక్కీర్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. గంధం దర్గా చేరిన అనంతరం ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనలు నిర్వహించారు. దర్గా దర్శనం కోసం రాష్ట్రాం నలుమూలల నుంచే కాక తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్ముకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు రెండులక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అన్నదానం కూడా నిర్వహించారు.
తరలివచ్చిన వివిధ దర్గాల ధర్మకర్తలు:
ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవంలో వివిధ దర్గాల పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరు మంగళవారం తెల్లవారు జామున జరిగిన గంధం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. బీదర్‌కు చెందిన సయ్యద్‌షా అసదుల్లా ఉసేని సజ్జదా నసీమ్, ఖ్వాజా అబుల్‌ఫైజ్ ఉసేని, ఐనూద్దీన్ ఉసేని, సయ్యద్‌షా మద్గీ ఉసేని, గుల్బర్గాకు చెందిన పీఠాధిపతులు సయ్యద్ ముజఫర్ ఉసేని చిష్తీ, సయ్యద్ ఖుబుల్లా ఉసేని సజ్జదే, సయ్యద్ ఖుద్బీ ఉసేని చిష్తీ, కర్నూల్ ఖాలీక్‌లింగ దర్గా ధర్మకర్త, కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి ఖలీల్‌బాష తదితర ప్రముఖులు దర్గాను దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ నల్లప్ప పోలీసు బందోబస్తు నిర్వహించారు.