రికార్డు సృష్టించనున్న తమిళనాడు మహిళ
చెన్నై: రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో తమిళనాడులోని ఓ మహిళా న్యాయవాది యోగాలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. కేపీ రంజన(34) వరల్డ్ రికార్డుకు చేరువయ్యారు. 53 గంటల పాటు నిర్విరామంగా యోగానాలు వేసిన ఘనత సాధించాలని సంకల్పించారు. రికార్డు సాధించేందుకు ఈ నెల 19న యోగాసనాలు వేయడం మొదలు పెట్టారు. 48 గంటల పాటు నిర్విరామంగా యోగాసనాలు వేస్తూ తన లక్ష్యానికి చేరువవుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ఈ ఫీట్ పూర్తి చేస్తారని భావిస్తున్నారు. ఆమె 600 యోగాసనాలు వేస్తారని, ప్రతి గంటకు 5 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటారని మహమహర్షి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ మహాయోగం ప్రతినిధి రమేశ్ రిషి తెలిపారు. నేపాల్ కు చెందిన ఉత్తమ్ ముక్తన్ అనే వ్యక్తి 50 గంటల 15 నిమిషాల పాటు యోగాసనాలు వేసి నెలకొల్పిన రికార్డును రంజన అధిగమించనుందని చెప్పారు.